Janasena: టీవీ9 రజినీకాంత్ ప్రశ్నకు జనసేన వద్ద జవాబు ఉందా?

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇటీవల ఒక డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో పొత్తులకు సంబంధించి ఆయన జనసేన, ఇతర రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడారు..

Written By: Suresh, Updated On : March 1, 2024 1:16 pm
Follow us on

Janasena: రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసేది కేవలం అధికారం కోసమే. రాజకీయ నాయకులు ప్రజాసేవ, ఇంకేదో చెబుతుంటారు కానీ.. అదంతా మీడియాలో రాసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారమే కాబట్టి.. దానికోసం ఎంతకైనా తెగిస్తాయి. అప్పటిదాకా విమర్శించిన పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటాయి. అప్పటిదాకా పొత్తు పెట్టుకున్న పార్టీలనే విమర్శిస్తాయి. ఈ రాజకీయ పరమపద సోపానంలో అన్ని పార్టీల చరిత్ర అలాంటిదే. అయితే ఈ పార్టీలకు సంబంధించి ఎవరైనా ఏదైనా ప్రశ్న సంధిస్తే మరీ ముఖ్యంగా పాత్రికేయులు అడిగితే రాజకీయ పార్టీల నాయకుల వద్ద చెప్పుకోవడానికి సమాధానం ఉండదు. అలాంటి పరిస్థితినే జనసేన ఎదుర్కొంది.

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇటీవల ఒక డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో పొత్తులకు సంబంధించి ఆయన జనసేన, ఇతర రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడారు.. చర్చ సందర్భంగా జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆ రెండు పార్టీలు రోజుల తేడాతో ఆవిర్భవించాయని, కానీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీని పంజాబ్, ఢిల్లీలో అధికారంలోకి తెచ్చారని, ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారని రజనీకాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఆ ప్రశ్నకు జనసేన నాయకుడి వద్ద సమాధానం లేకుండా పోయింది. ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

రజనీకాంత్ సంధించిన ప్రశ్నకు సంబంధించిన వీడియోను వైసిపి అనుకూల నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వారు అటు పవన్ కళ్యాణ్, ఇటు జనసేన పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.” జనసేన పార్టీ ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా అధికారంలోకి ఎందుకు రాలేదంటే కారణం ఇదని “వైసిపి అనుకూల నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు జనసేన అనుకూల నెటిజన్లు.. వైసిపి అనుకూల నెటిజన్ల తీరును విమర్శిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోలేదా? అని గుర్తు చేస్తున్నారు. రాజకీయ పార్టీలను తర్వాత పొత్తులు సహజమని, ఢిల్లీ, పంజాబ్ లాగా ఏపీలో పరిస్థితులు లేవని వారు వివరిస్తున్నారు. అలా అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి వచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి టీవీ9 రజనీకాంత్ సంధించిన ప్రశ్న అటు జనసేన, ఇటు వైసిపి అనుకూల నెటిజన్ల మధ్య చర్చకు దారితీస్తోంది.