https://oktelugu.com/

TDP: బిజెపికి టిడిపి బంపర్ ఆఫర్..

బిజెపికి దాదాపు సీట్లను చంద్రబాబు సర్దుబాటు చేశారని.. బిజెపి అగ్ర నేతలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సీట్ల సర్దుబాటుపై రకరకాల ప్రచారం నడుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : March 1, 2024 / 01:08 PM IST
    Follow us on

    TDP: తెలుగుదేశం పార్టీతో కలిసేందుకు బిజెపి ఒప్పుకుందా? టిడిపి ఎన్డీఏలోకి ఎంట్రీ ఇవ్వనుందా? చంద్రబాబు ఈనెల 4న ఢిల్లీ వెళ్ళనున్నారా? 5న పొత్తుపై స్పష్టమైన ప్రకటన రానుందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో బలమైన చర్చ నడుస్తోంది. టిడిపితో బీజేపీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కొలిక్కి రావడంతో చంద్రబాబును బిజెపి పెద్దలు ఆహ్వానించినట్లు సమాచారం. అయితే గతంలో ఇదే తరహా ప్రచారం జరిగింది. కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. అయితే వైసిపి అనుకూల మీడియాలో సైతం ఇటువంటి వార్తలు వస్తుండటంతో.. వాస్తవం ఉంటుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    అయితే బిజెపికి దాదాపు సీట్లను చంద్రబాబు సర్దుబాటు చేశారని.. బిజెపి అగ్ర నేతలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సీట్ల సర్దుబాటుపై రకరకాల ప్రచారం నడుస్తోంది. ఐదు అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలని.. కాదు కాదు 12 అసెంబ్లీ, ఏడు లోక్సభ స్థానాలని.. ఇలా సోషల్ మీడియాలో లేనిపోని ప్రచారం జరుగుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీ ఆశావహుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా జనసేనకు కీలక స్థానాలు కేటాయించడంతో.. చాలామంది నాయకులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

    పార్లమెంట్ స్థానాలకు సంబంధించి విశాఖపట్నం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, తిరుపతి, రాజంపేట, హిందూపురం నియోజకవర్గాలను బిజెపి అడుగుతోందని ప్రచారం జరుగుతోంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖ ఉత్తరం, తాడేపల్లిగూడెం, కైకలూరు, గుంటూరు పశ్చిమ, జమ్మలమడుగు, ధర్మవరం,రాజమండ్రి సిటీ స్థానాలను బిజెపికి కేటాయించినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఎల్లో మీడియాలో ఒక తరహా ప్రచారం జరుగుతుండగా.. నీలి మీడియాలో మరో తరహా ప్రచారం జరుగుతుండడం విశేషం. టిడిపి అనుకూల మీడియాలో తక్కువ స్థానాలను బిజెపికి ఇస్తున్నట్లు చెబుతుండగా.. వైసిపి అనుకూల మీడియాలో మాత్రం బిజెపి భారీగా సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు చూపిస్తుండటం గమనార్హం. మరోవైపు ఇప్పటికే టిడిపి ప్రకటించిన సీట్లను సైతం బిజెపి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు బిజెపి పవర్ షేరింగ్ను సైతం అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ప్రచారంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది.