Jagan: బిజెపి అడగకుండానే మద్దతిస్తున్న జగన్.. ఆ భయంతోనే!

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 166 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాలతో ఎన్డీఏ కూటమి గెలుపొందింది. వైసీపీ కేవలం 11 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది.

Written By: Dharma, Updated On : June 26, 2024 8:38 am

Jagan

Follow us on

Jagan: అధికారం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు జగన్. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేఖ కూడా రాశారు జగన్. తన ఐదేళ్ల పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలపై చంద్రబాబు సర్కార్ పునసమీక్షిస్తోంది. అవకతవకలను గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే క్యాబినెట్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలకు నోటీసులు అందాయి. ఇంకోవైపు కేసులు నమోదు చేసేందుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. దీంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. మీరే రక్షించండి అంటూ కేంద్ర పెద్దల శరణు కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర పెద్దలు అడిగిందే తడవుగా ఎన్డీఏ తరుపు స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన ఓం బిర్లా కు మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి బయటి నుంచి తమ మద్దతు ఉంటుందని బేషరతుగానే వెల్లడించారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 166 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాలతో ఎన్డీఏ కూటమి గెలుపొందింది. వైసీపీ కేవలం 11 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలతో వైసిపి విజయం సాధించింది. రాజ్యసభలో సైతం 11 మంది ఎంపీలను సాధించగలిగింది. అయితే గత ఐదు సంవత్సరాలుగా ఎన్డీఏ కు జగన్ మద్దతు తెలుపుతూనే ఉన్నారు. రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదానికి వైసీపీ మద్దతు బిజెపికి అవసరం. అందుకే బిజెపి సైతం వైసీపీతో సాన్నిహిత్యం కొనసాగించింది. రాష్ట్ర ప్రయోజనాల కంటే వైసీపీ రాజకీయ ప్రయోజనాలకు కేంద్రం ఇతోధికంగా సాయపడింది. కానీ ఎన్నికలకు ముందు టిడిపి తో పొత్తు పెట్టుకోవడంతో.. వైసిపి దూరం జరిగింది. అయితే ఎన్నికల్లో ఓటమి ఎదురు కావడంతో.. తనను తాను రక్షించుకునేందుకు జగన్ కేంద్ర పెద్దలను ఆశ్రయించక తప్పలేదు.

17వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎంపిక లాంచనమే. ఎన్డీఏకు 294 మంది ఎంపీల మద్దతు ఉంది. బిజెపి ఒంటరిగానే 240 స్థానాలను గెలుచుకుంది. ఇక ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాలు 54 సీట్లు గెలుచుకున్నాయి. ఇందులో 16 స్థానాలు టిడిపివి. ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిని ప్రకటించడంతో కేంద్ర పెద్దలు జాగ్రత్త పడ్డారు. చిన్నచితకా పార్టీలను కలుపుకోవాలని భావించారు. అందులో భాగంగా వైసీపీ మద్దతు కోరారు. ఇలా కోరారో లేదో తాము మద్దతిస్తామని జగన్ ముందుగానే చేతులెత్తారు. రెండు రోజుల కిందట దీనిపై కేంద్రానికి లిఖితపూర్వకంగానే సమాచారం పంపినట్లు తెలుస్తోంది.

జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. పదేళ్లుగా ఆయన బెయిల్ పై ఉన్నారు. ఆయనపై అరెస్టు కత్తి వేలాడుతూనే ఉంది. అందుకే గత పది సంవత్సరాలుగా బిజెపికి అనుకూలంగానే ఉన్నారు. 2014లో వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు.. బిజెపితో పూర్తిస్థాయి సఖ్యత ప్రదర్శిస్తూ వచ్చారు. పైకి అంశాల వారిగా మద్దతు అని చెబుతూనే.. బిజెపి అడగకముందే మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి టిడిపి మద్దతు కీలకం. జగన్ సంఖ్యా బలం కేవలం నాలుగు మాత్రమే. అందుకే జగన్ కంటే చంద్రబాబుకి బిజెపి అగ్రనేతలు ప్రాధాన్యమిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వెంటాడుతుండడం, మరోవైపు కేంద్రంలో చంద్రబాబు కీలకంగా మారడంతో.. తనకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని జగన్ గ్రహించారు. అందుకే కేంద్ర పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. వారు అడగకుండానే మద్దతు ప్రకటిస్తున్నారు.