YCP: బిజెపి పెద్దల నుంచి హామీ లభించిందా? స్పీకర్ ఎన్నిక కోసం జగన్ మద్దతు అందుకేనా?

ఏపీలోని జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసిపి ఎంపీలు బిజెపి ఎంపీ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతు ఇస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరులకు వెల్లడించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 26, 2024 9:29 am

YCP

Follow us on

YCP: రాజకీయాలలో అవసరాలు మాత్రమే ఉంటాయి. వాటికి అనుగుణంగానే నాయకుల అడుగులు ఉంటాయి. అప్పటిదాకా విమర్శలు చేసుకున్న వారు కలిసిపోతారు. కత్తులు దూసుకున్న వారు భాయ్ భాయ్ అంటూ భుజాల మీద చేతులు వేసుకుంటారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. స్వ డబ్బా, పర డబ్బా.. మొత్తానికి పరస్పర డబ్బా కొట్టుకుంటుంటారు. ఇందుకు ఏ పార్టీ కూడా అతీతం కాదు. తాజాగా దీన్ని నిరూపించే సంఘటన మరోసారి దేశ రాజకీయాల్లో జరిగింది.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆశించినంత స్థాయిలో స్థానాల్లో రాలేదు. దీంతో భాగస్వామ్య పార్టీలతో కలిసి నరేంద్ర మోదీ, ఎన్డీఏ కూటమి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో తెలుగుదేశం, జేడీయూ, జేడీఎస్, జనసేన పార్టీలు కీలకంగా ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు, నితీష్ కుమార్, కుమారస్వామి పార్టీల ఎంపీలకు మంత్రి పదవులు దక్కాయి. అయితే లోక్ సభను నడిపించేందుకు స్పీకర్ కావాలి, ప్రస్తుతం స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు స్పీకర్ ఎన్నికకు ఎన్నడూ ఇతర పార్టీల నుంచి పోటీ ఎదురు కాలేదు. అయితే తొలిసారి ఇండియా కూటమి నుంచి బిజెపికి స్పీకర్ ఎన్నిక విషయంలో పోటీ ఎదురైంది. ఓం బిర్లాను స్పీకర్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ప్రతిపాదించగా.. కేరళ రాష్ట్రంలోని మావేలికర పార్లమెంటు స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా గెలిచిన కోడికున్నిల్ సురేష్ ను కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించింది. బుధవారం స్పీకర్ ఎంపికకు సంబంధించిన ఎన్నిక జరగనుంది.

ఏపీలోని జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసిపి ఎంపీలు బిజెపి ఎంపీ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతు ఇస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఇటీవల ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి చేతిలో వైఎస్ఆర్సిపి చిత్తుగా ఓడింది. ఆ పార్టీకి దిగువ సభలో కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు 22 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇటీవలి ఎన్నికల్లో ఆ సీన్ రిపీట్ కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా స్థానాలు గెలుచుకున్న టిడిపి.. ఏకంగా 16 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. దాని మిత్రపక్షాలు బిజెపి, జనసేన కలిసి ఐదు పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నాయి. ” మద్దతు ప్రతిపాదన అత్యంత ముఖ్యమైనది కాకపోవచ్చు. ఎందుకంటే బిజెపి ప్రతిపాదించిన ఓం బిర్లా గెలిచేందుకు.. ఎన్డీఏ కూటమి స్పష్టమైన బలాన్ని కలిగి ఉంది. అలాంటప్పుడు వైఎస్ఆర్సిపి మద్దతు పెద్ద లెక్కలోకి రాదని” టిడిపి నాయకులు అంటున్నారు.

ఇక వైఎస్ఆర్సిపి గతంలో బిజెపికి పార్లమెంట్, రాజ్యసభలో మద్దతు ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం ఆమోదానికి, 370 ఆర్టికల్ రద్దుకు మద్దతు ఇచ్చింది. వైఎస్ఆర్సిపి లాగే ఒడిశా లో అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కూడా బిజెపికి మద్దతు ఇచ్చింది.. అయితే ఇటీవల ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ పార్టీ ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.. వైఎస్ఆర్సిపి మద్దతు ఇస్తే ఓం బిర్లాకు అనుకూలంగా ఓటు వేసే ఎంపీల సంఖ్య 297కు చేరుకుంటుంది. దీనివల్ల ఓం బిర్లా కు అజేయమైన ఆధిక్యం లభిస్తుంది. బిజెపికి ఇప్పటికే తన సొంత ఎంపీల నుంచి 240 ఓట్లు ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి 53 ఓట్లు ఉన్నాయి.ఇక ప్రతిపక్షానికి 232 మంది ఎంపీలు ఉన్నారు.

స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఏకాభిప్రాయంతో ఆ పదవిని భర్తీ చేసేలా పార్లమెంటరీ సంప్రదాయం ఉండేది. ఓం బిర్లాను స్పీకర్ గా నియమించేందుకు.. మద్దతు ఇవ్వాలని బిజెపి ప్రతిపక్షాలను సంప్రదించింది. అయితే బిజెపియేతర ఎంపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరాయి. దీనిని బిజెపి తోసిపుచ్చింది. ఫలితంగా ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా సురేష్ ను తెరపైకి తీసుకువచ్చింది. వెంటనే సురేష్ తన నామినేషన్ దాఖలు చేశారు..” ఇది నా నిర్ణయం కాదు, పార్టీది. ప్రతిపక్షానికి చెందిన ఎంపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు బిజెపి ఒప్పుకోవడం లేదు.. మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల వరకు ఎదురు చూసాం. బిజెపి నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదు. దీంతో నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని” సురేష్ పేర్కొన్నారు.. మరోవైపు సురేష్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కోరడం అనాలోచిత చర్య అని అభివర్ణించారు.

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి స్పీకర్ పదవి కోసం మిత్రపక్షాల మధ్య పోరు సాగింది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని.. స్పీకర్ పదవిలో తన పార్టీ అభ్యర్థి ఉంటారని బిజెపి స్పష్టం చేయడంతో.. అటు టిడిపి, ఇటు జెడియు సైలెంట్ అయ్యాయి. బిజెపి తొలిసారిగా ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలోని కటక్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన ఎంపీ భర్తృహరి మహతాబ్ ను బిజెపి నియమించవచ్చనే ఊహగానాలు వ్యక్తమయ్యాయి. అయితే మహతాబ్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించారు. ఆయన పార్లమెంటు సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.. అయితే ప్రొటెమ్ స్పీకర్ గా సురేష్ ను నియమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. మహతాబ్ నియామకంపై విరుచుకుపడింది.. అయినప్పటికీ బిజెపి వెనుకడుగు వేయలేదు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అందించే విషయంలో బిజెపి స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే వైసిపి స్పీకర్ ఎన్నికకు మద్దతు పలుకుతోందని తెలుస్తోంది. మరోవైపు టిడిపి కూడా స్పీకర్ విషయంలో పట్టు పట్టకపోవడానికి ఇదే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తన రాజకీయ చాణక్యంతో నరేంద్ర మోదీ అటు టిడిపిని, ఇటు వైసీపీని తన ఆధీనంలో ఉంచుకున్నారని స్పష్టమవుతోంది.