Raghurama Krishnam Raju: రఘురామకృష్ణం రాజు భారీ స్కెచ్ వేశారా? జగన్ తో పాటు వైసీపీ నేతలతోనే సార్ అని పిలిపించుకోనున్నారా? తనను అగౌరవపరిచిన వారి నుంచి గౌరవం కోరుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నరసాపురం ఎంపీ టికెట్ దక్కక తీవ్ర నిరాశతో ఉన్న రఘురామకృష్ణం రాజు..ఇప్పటికీ ఓ నమ్మకంతో అయితే ఉన్నారు. తనకు ఎంపీగానో, ఎమ్మెల్యే గానో తప్పకుండా పోటీ చేసేందుకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబుపై నమ్మకం పెట్టుకున్నారు. తనకు ఏదో ఒక చోట సర్దుబాటు చేస్తారని భావిస్తున్నారు. అయితే ఎంపీ అయితే ఒకలా, ఎమ్మెల్యే అయితే మరోలా వ్యవహరించాలని భారీ ఆలోచనతో ఉన్నారు. తనను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలతోనే సలాం కొట్టించుకునేందుకు చూస్తున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి రఘురామకృష్ణం రాజు గెలుపొందారు. అయితే గెలిచిన ఆరు నెలలకే వైసిపి నాయకత్వాన్ని విభేదించారు. రెబల్ గా మారారు. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజు పై కేసులు నమోదయ్యాయి. ఒకసారి అరెస్టయ్యారు కూడా. అప్పటినుంచి వైసిపి ప్రభుత్వానికి, సీఎం జగన్ వైఖరిని నిరసిస్తూ రఘురామ కంటిమీద కునుకు లేకుండా చేశారు. వైసీపీ సైతం ఆయనపై అనర్హత వేటు వేయాలని ప్రయత్నించింది. కానీ అవేవీ వర్క్ అవుట్ కాలేదు. కేంద్ర పెద్దలు అడ్డుకున్నట్లు తెలిసింది. అయితే ఇన్నాళ్లు ఆయన బిజెపి నాయకత్వాన్ని అనుసరించారు. కానీ ఎన్నికల ముందుట రఘురామకృష్ణం రాజుకు షాక్ తగిలింది. ఆయనకు నరసాపురం ఎంపీ సీటు బిజెపి ప్రకటించలేదు.మరో నేత భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పేరును ఖరారు చేసింది. అయితే తనకు టిక్కెట్ రాకుండా చేయడంలో జగన్ విజయం సాధించారని స్వయంగా రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. బిజెపిలోని ప్రో వైసిపి నేతలతో జగన్ అనుకున్నది సాధించగలిగారని రఘురామ చెప్పుకొచ్చారు. అయినా సరే తాను ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం చంద్రబాబు రఘురామ కు సీటు సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు. నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలోని ఉండి అసెంబ్లీ సీటును కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. రఘురామ కోసం ఏలూరు పార్లమెంటు సీటును విడిచి పెట్టేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు. దాని స్థానంలో నరసాపురం రఘురామకు విడిచి పెట్టాలని బిజెపి నాయకత్వాన్ని కోరారు. అయితే ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రజలు తిరస్కరించడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. అందుకే ఉండి నియోజకవర్గాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పుడు ఆ అభ్యర్థిని తప్పించి రఘురామ కృష్ణంరాజు పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. ఇంకా రఘురామకృష్ణంరాజుకు టికెట్ ప్రకటించలేదు. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. కానీ రఘురామ మాత్రం భారీ ప్లాన్ తో ఉన్నారు. తనకు స్పీకర్ పదవి చేయాలని ఉందని తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు. అయితే రఘురామ స్పీకర్ ఆలోచన వైసిపి కోసమేనని అందరికీ తెలిసిన విషయమే. జగన్ తో పాటు వైసీపీ నేతలు ఏ రేంజ్ లో తనపై విరుచుకుపడ్డారో రఘురామరాజుకు తెలుసు. అందుకే వారందరితో అధ్యక్షా అని అనిపించుకునేందుకు రఘురామ తహతహలాడుతున్నారు. జగన్ ముందు తాను తల ఎత్తుకొని తిరగాలంటే స్పీకర్ పదవి చేపట్టాలని రఘురామ భావిస్తున్నారు. అయితే రఘురామ ఆలోచన అయితే బాగుంది కానీ.. పదవి పొందడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.