JC Prabhakar Reddy VS Madhavi Latha
JC Prabhakar Reddy VS Madhavi Latha : ఏపీలో( Andhra Pradesh) కూటమిలో మరో కలకలం. బిజెపి నేత, సినీనటి మాధవి లత పై పోలీస్ కేసు నమోదయింది. గత కొద్ది రోజులుగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డితో ఆమెకు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. జెసి వర్సెస్ మాధవి లత అన్నట్టు పరిస్థితి మారింది. ఈ ఏడాది నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న అనంతపురంలో మహిళలతో ఒక వేడుక నిర్వహించారు జెసి ప్రభాకర్ రెడ్డి. అయితే ఆ వేడుకలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు నటి మాధవి లత. దీనిపై జెసి ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆమెపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడంతో జెసి ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరారు. అయితే అంతటితో ఆ వివాదం ముగుస్తుందని అంతా భావించారు. కానీ జెసి ప్రభాకర్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులపై సినీనటి మాధవి లత సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దానిపై కేసు నమోదు కావడంతో ఈ వివాదం కొనసాగుతూ వచ్చింది.
* ఓ మహిళా నేత ఫిర్యాదుతో..
తాజాగా తాడిపత్రిలో( Tadipatri) ఓ మహిళా నేత ఇచ్చిన ఫిర్యాదుతో సినీనటి మాధవి లత పై కేసు నమోదయింది. దీంతో ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది. ఏటా నూతన సంవత్సర వేడుకలు మహిళలతో నిర్వహించడం తాడిపత్రిలో ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాధవి లత కామెంట్స్ చేశారు. దీనిపై జెసి ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆమె విషయంలో నోరు జారారు. దీంతో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు స్పందించడంతో తన మాటలను వెనక్కి తీసుకున్నారు. క్షమాపణలు కోరారు జెసి ప్రభాకర్ రెడ్డి. అయితే అప్పట్లో జెసి ఫ్యామిలీకి చెందిన ఓ బస్సు అనంతపురం బస్టాండ్ వద్ద దగ్ధం అయ్యింది. దాని వెనుక బిజెపి నేతల హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి.
* వరుస వివాదాలు
అయితే అదే సమయంలో బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తో( Aadhi Narayan Reddy ) రాయలసీమలో బూడిద పంచాయతీ నడిచింది ప్రభాకర్ రెడ్డికి. అటు తరువాత గత నెలలో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జెసి ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు అయింది. తనపై సోషల్ మీడియా వేదికగా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నటి మాధవి లత ప్రభాకర్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారింది. అయితే తాజాగా సినీ నటి మాధవి లత పై ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న మహిళలను కించపరిచేలా మాధవి లత వ్యాఖ్యానించారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి టౌన్ సిఐ సాయి ప్రసాద్ తెలిపారు. దీంతో ఈ విషయం కొత్త టర్న్ తీసుకున్నట్లు అయింది. మళ్లీ వివాదం మొదటికి వచ్చింది.