Dhanunjaya Reddy : ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam) రోజుకో మలుపు తిరుగుతోంది. అరెస్టులతో పాటు కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సూత్రధారిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి తో పాటు జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి సైతం అరెస్టయ్యారు. నాటకీయ పరిణామాల నడుమ మూడు రోజుల విచారణ అనంతరం వీరి అరెస్టు జరగడం విశేషం. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కీలక అరెస్టులు జరుపుతుండడంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపినట్టు అయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించినట్లు అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు అయిన తరువాత విచారణ వేగవంతంగా సాగింది. దాదాపు రూ.3500 కోట్లు మద్యం ద్వారా పక్కదారి పట్టినట్లు స్పష్టమైంది. దీంతో ఇప్పుడు అరెస్టుల పర్వం కొనసాగుతోంది.
* కూటమి వచ్చిన వెంటనే ఫోకస్..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం పై దృష్టి పెట్టింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో భారీగా అవినీతి జరిగినట్లు గుర్తించింది. అందుకే ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత.. కీలక ఆధారాలు బయటపడిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. శరవేగంగా పావులు కలిపిన సిట్ అరెస్టుల పర్వం కొనసాగించింది. కొద్ది రోజుల కిందట రాజ్ కసిరెడ్డి తో పాటు ఆయన అనుచరుడును అదుపులోకి తీసుకుంది. మూడు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు గోవిందప్ప బాలాజీని అదుపులోకి తీసుకుంది. మూడు రోజుల విచారణ అనంతరం ఇప్పుడు ధనుంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఈ కేసులో వీరిద్దరూ ఏ 31, ఏ 32 గా ఉన్నారు. వీరి అరెస్టుతో ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఒక్కసారి కలకలం చోటుచేసుకుంది.
Also Read : వర్దెల్లి మురళిని కాదని.. ధనుంజయ రెడ్డి వైపు జగన్ ఎందుకు మొగ్గాడు.. సాక్షి లో జరుగుతున్న పరిణామాలేంటి?
* విజయసాయిరెడ్డి ఆధారాలతో..
మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి( Vijaya Sai Reddy) సైతం ఓ నిందితుడు. ఓ కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో తమ పాత్ర లేదని.. అంతా రాజ్ కసిరెడ్డి చూశారని చెప్పుకొచ్చారు. కర్త,కర్మ, క్రియ ఆయనే అంటూ తేల్చేశారు. సిట్ ఆదేశిస్తే తాను వివరాలు కూడా సమర్పిస్తానని కూడా చెప్పుకున్నారు. దీంతో సిట్ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఆయన సైతం విచారణకు హాజరయ్యారు. అటు తరువాత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సైతం విచారణకు హాజరయ్యారు. అటు తరువాత రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్టయ్యారు. తాజాగా ధనుంజయ రెడ్డి తో పాటు కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం మాత్రం ఈ కేసులో కొత్త మలుపు. వారి ముందస్తు బెయిల్ పిటిషన్ లను కోర్టు కొట్టివేయడంతోనే సిట్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
* మూడు రోజులుగా విచారణ..
కొద్ది రోజుల కిందట ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ ఇద్దరికీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కానీ వారు విచారణకు హాజరు కాలేదు. అయితే ఇప్పుడు కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో తమ అరెస్టు ఉంటుందని ఒక అంచనాకు వచ్చారు. అందుకే గత మూడు రోజులుగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టివేతతో వీరి అరెస్టుకు మార్గం సుగమం అయింది. అయితే ఈ ఇద్దరి అరెస్టుతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిసుకునట్లు అయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
3 రోజులు విచారణ అనంతరం మాజీ CMO కార్యదర్శి ధనుంజయ రెడ్డి.
జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డి ని అరెస్ట్ చేసిన SIT అధికారులు. pic.twitter.com/foTmWCaaNG
— Anitha Reddy (@Anithareddyatp) May 16, 2025