Rains: తెలుగు రాష్ట్రాలకు( Telugu States) చల్లటి వార్త. వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఏపీతోపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల రాక ప్రభావంతో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. ఐ ఎం డి హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తుంది విపత్తుల నిర్వహణ సంస్థ. వర్షాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను నియంత్రించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాలు తాకాయి. మరోవైపు ఈ నెల 27న కేరళకు తాకనున్నాయి. జూన్ మొదటి వారంలో ఏపీ వ్యాప్తంగా విస్తరిస్తాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది.
Also Read: నాగ్-ధనుష్ ల కుబేరకు భారీ ఓటీటీ డీల్, ఎవరు కొన్నారంటే?
* ఉత్తర భారత దేశంలో అధిక..
నైరుతి రుతుపవనాల రాక ప్రారంభమైన నేపథ్యంలో.. వర్షాలు విస్తారంగా పడనున్నాయి. రుతుపవనాలు ఉత్తర భారతంలో ( North India)ప్రారంభమై దక్షిణ భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర… తదితర రాష్ట్రాల్లో మే 19 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
* ఐదు రోజులపాటు వర్షాలు..
ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడు( Tamil Nadu ), కర్ణాటక, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఢిల్లీ, పంజాబ్,హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ధూళి తుపానులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు బయట ప్రాంతాలకు వచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అలర్ట్ గా ఉండాలని కీలక ఆదేశాలు ఇచ్చింది.
* 18 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణకు( Telangana) భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. మరో 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నట్లు స్పష్టతనిచ్చింది వాతావరణ శాఖ. ఈ ఉపరితల ఆవర్తనం ఈనెల 22 నాటికి బలపడనుందని కూడా అంచనా వేస్తోంది. దీనికి శక్తి అనే పేరు కూడా పెట్టారు. ఇది మరింత బలపడడానికి అనుకూల వాతావరణం ఉంది. ప్రధానంగా ఏపీతోపాటు ఒడిస్సా పై దీని ప్రభావం అధికంగా ఉండనుంది.