Current Bills Changes in AP : ఏపీ ప్రభుత్వం( AP government) పౌర సేవల విషయంలో సరళతరమైన విధానాలను తీసుకొస్తోంది. అందులో భాగంగానే వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టింది. 500 రకాల పౌర సేవలు అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్లు, పరీక్ష ఫలితాలను సైతం అదేవిధంగా వెల్లడిస్తోంది. తాజాగా డీఎస్సీ హాల్ టికెట్ల జారీ ప్రక్రియ కూడా వాట్సాప్ ద్వారా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి కూడా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకుంటోంది. తాజాగా విద్యుత్ బిల్లులు కట్టే విధానంలో కూడా సమూల మార్పులు తెచ్చింది. ఇకపై క్యూఆర్ కోడ్ ద్వారా సులువుగా బిల్లులు చెల్లించవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ ల ద్వారా బిల్లు స్కాన్ చేసి వెంటనే చెల్లింపులు చేయవచ్చు. ఈ విధానం ద్వారా బిల్లులు కట్టడానికి కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదు. ఈ కొత్త విధానంతో సమయం కూడా ఆదా అవుతుంది. అయితే విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తోంది విద్యుత్ శాఖ. అయితే ఈ కొత్త విధానం ద్వారా క్షణాల్లో బిల్లులు చెల్లించే అవకాశం ఉంది.
* జూన్ నెల బిల్లులో క్యూఆర్ కోడ్..
సాధారణంగా ప్రతి నెల మొదటి వారంలో విద్యుత్ బిల్లులు( electricity bill) రీడింగ్ తీస్తారు. జూన్ నెలకు సంబంధించి జారీ చేసే విద్యుత్ బిల్లుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ను ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ ద్వారా స్కాన్ చేయాలి. వెంటనే బిల్లు మొత్తం కనిపిస్తుంది. వినియోగదారుడు సంబంధిత ఫోన్ పే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేస్తే బిల్లు చెల్లింపు పూర్తవుతుంది. ఈ సరికొత్త విధానం ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు వర్తించదని తెలుస్తోంది. బకాయిలు ఉన్న వినియోగదారులకు కూడా ఈ అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. గత నెల బిల్లు చెల్లించకపోయినా.. ఈనెల బిల్లులో క్యూఆర్ కోడ్ కనిపించదు.
Also Read : టీజీఆర్టీసీ లో కీలక పరిణామం.. ఏకంగా సజ్జనార్ పై ఆరోపణలు చేసిన ఉద్యోగులు
* విద్యుత్ సేవలను చేరువ చేసేందుకు..
ప్రజలకు విద్యుత్ సేవలను( electrical services) మరింత చేరువ చేసేందుకు ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ సర్వీసుల మినహా అన్ని ప్రైవేటు సర్వీసులకు ఈ విధానం వర్తిస్తుంది. బిల్లులు ఎలా చెల్లించాలో బిల్ ట్రేడర్స్ వినియోగదారులకు అవగాహన కల్పించనున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించడం చాలా సులువుగా మారనుంది. ఫోన్ పే లో డబ్బులు ఉంటే ఎప్పుడైనా బిల్లు చెల్లించవచ్చు. దీని ద్వారా ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది. బిల్లు చెల్లింపు కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మొత్తం మీద కరెంట్ బిల్లు చెల్లించడం అనేది ఇకనుంచి చాలా సులభతరం కానుంది అన్నమాట. బిల్లు వచ్చిన వెంటనే జేబులో పెట్టుకుని.. డబ్బులు ఉన్నప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించవచ్చు.