Golden chance to ycp mlc : ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను.. 11 సీట్లతో సరిపెట్టుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. స్పీకర్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకే జగన్ కేవలం వైసీపీ శాసనసభ పక్ష నేత మాత్రమే. అంతకుమించి ఆయనకు ప్రత్యేక గౌరవం లేదు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో నేతకు మాత్రం క్యాబినెట్ హోదా దక్కింది. జగన్ కు మించి గౌరవం దక్కనుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
* శాసనమండలి విపక్ష నేతగా
శాసనమండలికి చీఫ్ గా చైర్మన్ ఉంటారు. ప్రస్తుతం వైసీపీకి చెందిన మోసేన్ రాజు మండలి చైర్మన్ గా ఉన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చింది. దీంతో చైర్మన్ వైసీపీకి చెందినా.. శాసనమండలిలో విపక్ష నేతగా వైసిపి ఎమ్మెల్సీ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకే దీనిపైమండలి చైర్మన్ వైసీపీ అధినేత జగన్ అభిప్రాయాన్ని కోరారు. జగన్ సూచన మేరకు పార్టీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. గుంటూరుకు చెందిన లేళ్ళ అప్పిరెడ్డి జగన్ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక ఎమ్మెల్సీ. వైసీపీ కార్యాలయ కార్యదర్శి కూడా. జగన్ తో పోల్చుకుంటే అప్పిరెడ్డి స్థాయి చిన్నది. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పి రెడ్డి పై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు కేసులు నమోదయ్యాయి. అసలు ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ తిరస్కరించినట్లు కూడా ప్రచారం జరిగింది. అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే గవర్నర్ ఆమోదించినట్లు తెలుస్తోంది.
* అరుదైన గౌరవం
ఇప్పుడు అప్పి రెడ్డికి జగన్ కు లేనంత గౌరవం దక్కనుంది. ప్రత్యేక ఛాంబర్, ప్రోటోకాల్, గౌరవ మర్యాదలు లభిస్తాయి. కానీ జగన్ కు శాసనసభలో ఇవేవీ ఉండవు. 58 స్థానాలు కలిగిన శాసనమండలిలో వైసీపీకి 38 సభ్యుల బలం ఉంది. దీంతో అప్పిరెడ్డిని ఆ సభలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం గుర్తించింది. ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు అప్పి రెడ్డి.
* సాధారణ ఎమ్మెల్యే గానే జగన్
శాసనసభలో 11 స్థానాలకే వైసీపీ పరిమితం అయ్యింది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10 శాతం సీట్లు దక్కించుకోవాలి. ఈ లెక్కన 18 సీట్లు రావాలి. కానీ వైసిపి చాలా దూరంలో నిలిచిపోయింది. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదు. అయితే స్పీకర్ విచక్షణాధికారంతో ప్రతిపక్ష హోదా కేటాయించే అవకాశం ఉంది. కానీ గత అనుభవాల దృష్ట్యా జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు స్పీకర్ అంగీకరించలేదు. అందుకే జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యేతో పాటు వైసిపి శాసనసభాపక్ష నేత మాత్రమే. కానీ లేళ్ల అప్పిరెడ్డికి మాత్రం శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇచ్చారు. జగన్ కు లేని గౌరవాన్ని కట్టబెట్టారు. అయితే ఇటువంటి గౌరవాన్ని తోటి వైసీపీ నేతలకు ఇచ్చేందుకు జగన్ అంగీకరించరు. కానీ ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో అంగీకరించాల్సిన పరిస్థితి దాపురించింది. వైసీపీలో సైతం ఇది హాట్ టాపిక్ గా మారింది.