https://oktelugu.com/

Their eyes are on TDP : నాడు ఫిరాయించారు.. నేడు వస్తామంటున్నారు.. వైసీపీలో గోడమీద పిల్లులు రెడీ!

అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే నేతలు ఉండడం సహజం. 2019 ఎన్నికల్లో టిడిపికి అధికారం దక్కకపోవడంతో.. నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అందుకే దారులు వెతుక్కుంటున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 23, 2024 / 10:50 AM IST
    Follow us on

    Their eyes are on TDP : తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్లిన నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. వైసిపిలో భవిష్యత్ లేకపోవడంతో మాతృ పార్టీ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 23 మంది గెలిచారు. అందులో నలుగురు వైసీపీలోకి ఫిరాయించారు. ఈ ఎన్నికల్లో ముగ్గురు నేతలు టిక్కెట్లు దక్కించుకున్నారు. ముగ్గురూ ఓడిపోయారు. టికెట్ దక్కించుకోలేని మద్దాలి గిరి ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. కూటమిలోని మూడు పార్టీల్లో.. ఏదో ఒక దానిలో చేరనున్నారు. మిగతా ముగ్గురిలో.. వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపి వైపు ఆశగా చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    * పిలిచి మరీ టిక్కెట్
    2014లో స్పిన్నింగ్ మిల్ నడుపుకునే మద్దాలి గిరికి పిలిచి గుంటూరు తూర్పు నియోజకవర్గ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ముస్లిం ప్రభావిత నియోజకవర్గం కావడంతో మద్దాలి గిరి ఓడిపోయారు. కానీ టిడిపి అధికారంలోకి రావడంతో ఐదేళ్ల పాటు అనధికార ఎమ్మెల్యేగా చలామణి అయ్యారు. పార్టీకి విశ్వాసపాత్రుడుగా ఉండడంతో మద్దాలి గిరికి 2019లో గుంటూరు పశ్చిమ టిక్కెట్ కేటాయించారు చంద్రబాబు. ఎన్నికల్లో గెలిచారు కూడా. అయితే గెలిచిన కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. కేవలం వ్యాపార నిమిత్తం పార్టీ మారారు. కానీ ఈ ఎన్నికల్లో మద్దాలి గిరిని అసమర్ధుడిగా తేల్చేశారు జగన్. ఆయనను పక్కన పెట్టి విడదల రజనికి టిక్కెట్ ఇచ్చారు. ఆమె విజయానికి మద్దాలి గిరి కృషి చేశారు. కానీ వైసీపీలో అంత గుర్తింపు లేదు. ఏ వ్యాపారాల భయంతో వైసీపీలో చేరారో.. అదే భయంతో ఇప్పుడు టిడిపి వైపు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

    * శతవిధాలా ప్రయత్నిస్తున్న బలరాం
    చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం సైతం టిడిపిలో చేరేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి అనూహ్యంగా టిడిపి టికెట్ దక్కించుకున్నారు బలరాం. ఆయన విజయం సాధించినా టిడిపి మాత్రం అధికారంలోకి రాలేదు. ఆయనకు క్వారీ వ్యాపారాలు ఉన్నాయి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం దాడులు, కేసుల భయంతో వైసీపీలోకి ఫిరాయించాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు వైసీపీ టికెట్ లభించింది. కానీ ఓడిపోయారు. ఇప్పుడు అదే వ్యాపారాలపై భయంతో టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు నుంచి ఆశించినంతగా సానుకూలత లేదు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణం ఆయన టిడిపిలో చేరడం ఖాయం.

    * గణేష్ కుమార్ ఆరాటం
    విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వాసుపల్లి గణేష్ కుమార్. డిఫెన్స్ అకాడమీ తో పాటు విద్యాసంస్థలు ఆయనకు ఉన్నాయి.2014, 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. అయినా సరే చంద్రబాబు ఛాన్స్ ఇస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో గణేష్ కుమార్ గెలిచినా టిడిపి అధికారంలోకి రాలేదు. దీంతో విద్యాసంస్థల పరంగా వైసిపి నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆయన వైసీపీలోకి ఫిరాయించారు. ఈ ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దారుణ పరాజయం ఎదురైంది. ఇప్పుడు ఈయన సైతం టిడిపిలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ నాయకత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు.

    * అజ్ఞాతంలో వల్లభనేని వంశీ
    వల్లభనేని వంశీ మోహన్ 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గన్నవరం నుంచి గెలిచారు. 2014లో తొలిసారి టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో సైతం గెలిచారు. గత ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలోకి ఫిరాయించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బూతులు మాట్లాడారు. చంద్రబాబు సతీమణి పై సైతం నోరు పారేసుకున్నారు. ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన అమెరికాకు మకాం మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన టిడిపిలోకి వస్తానని ముందుకొచ్చినా చేర్చుకునే పరిస్థితి లేదు. మొత్తానికైతే టిడిపి నుంచి వైసీపీలోకి ఫిరాయించిన వారు తిరిగి మాతృ పార్టీలో చేరేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి వారికి ఎటువంటి అనుమతి లేదు. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్న క్రమంలో.. వీరికి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.