Union Budget 2024 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలో బడ్జెట్-2024ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సితారామన్ బడ్జెట్ పెట్టడం ఇది వరుగా ఏడో సారి. ఈ బడ్జెట్ తో ఆమె తన పదవీకాలంలో 5 పూర్తి బడ్జెట్ లు, ఒక మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరుపై ఉన్న రికార్డును అధిగమించనున్నారు. మోడీ ప్రభుత్వం 3.O మొదలైన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశమే కాదు.. దాదాపు ప్రపంచం మొత్తం భారత్ బడ్జెట్ కోసం ఎదురు చూస్తోంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్ తో పెద్దగా వరాలు ఇవ్వని ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ తో భారీగా వరాలు గుప్పిస్తుందని అనుకుంటున్నారు. పేపర్ లెస్ రూపంలో బడ్జెట్ రావడం ఇది మూడోసారి. నిర్మలా సీతారామన్ బడ్జెట్ పత్రాలను ఎరుపు రంగు దస్త్రంలో ముద్రించిన టాబ్లెట్లో (ట్యాబ్)లో తీసుకువెళతారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ అంచనా వ్యయాలు, రాబడుల ప్రకటనను ఆమె రాజ్యసభలో ప్రవేశపెడతారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన గంట తర్వాత ఇది జరుగుతుంది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ ప్రకటనను ప్రవేశపెడతారు.
ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, 2003లోని సెక్షన్ 3లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం ప్రభుత్వ స్థూల ఆర్థిక ఫ్రేమ్ వర్క్ స్టేట్ మెంట్స్, మీడియం టర్మ్ ఫైనాన్షియల్ పాలసీ స్ట్రాటజీని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో కూడా దీన్ని ప్రదర్శించనున్నారు.
అనంతరం 2024-25 సంవత్సరానికి కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము-కశ్మీర్ ఆదాయ, వ్యయాలను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. భారత్ అభివృద్ధే లక్ష్యంగా కేంద్రం 2024-25 ఫైనాన్సియల్ ఇయర్ లో 8 నెలల కాలానికి మంగళవారం (జూలై 23) లోక్‌సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. నిత్యావసరాలతో పాటు అన్నింటి ధరలు మండిపోతున్న స్థితిలో మధ్య తరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు-2024 నేపథ్యంలో ఫిబ్రవరిలో కేంద్రం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ప్రవేశపెట్టబోయేది పూర్తి స్థాయి పద్దును సమర్పించనుంది.
అభివృద్ధి, సంక్షేమ పథకాల మధ్య సమతూకం పాటించాలని, వృద్ధికి ఊతంతో పాటు ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు ఆమెకు సూచనలు చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.
20 గంటల పాటు చర్చ..
కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభ, రాజ్యసభల్లో వేర్వేరుగా పది, పది గంటల చొప్పున చర్చ జరిగే అవకాశం ఉంది. దిగువ సభలో రైల్వేలు, ఆరోగ్యం, విద్య, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తదితర అంశాలను చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వివిధ పార్టీల ఎంపీలతో కూడిన సభా వ్యవహారాల కమిటీ సోమవారం (జూలై 22) భేటీ అయ్యి ఎజెండాను ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో నిన్న ఫైనాన్స్ కమిటీ పలు విషయాలను మీడియా ముఖంగా వివరించింది. బడ్జెట్ లో ఏఏ అంశాలు ఉండబోతున్నాయో వివరించింది. ఈ మేరకు ఆయా రంగాలకు కేటాయింపులు ఉండచ్చని స్పష్టం చేసింది.