https://oktelugu.com/

AP Elections 2024: పోస్టల్ బ్యాలెట్ తో తొలి రౌండ్ నుంచే వైసిపికి కౌంట్ డౌన్

కౌంటింగ్ లో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అంటే తొలి రౌండులలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకం కానున్నాయి. ఈ లెక్కన అధికార వైసిపికి.. ప్రారంభ రౌండు నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.

Written By:
  • Dharma
  • , Updated On : May 31, 2024 / 09:47 AM IST

    AP Elections 2024

    Follow us on

    AP Elections 2024: ఏపీలో గట్టి యుద్ధమే నడిచింది. ఎన్నికల్లో హోరాహోరి పోరు సాగింది. గెలుపు పై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకము కానున్నాయి. దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు.దాదాపు ప్రతి నియోజకవర్గంలో 3,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. అయితే వీరు ఎటువైపు మొగ్గు చూపారా? అన్నది స్పష్టంగా తెలుస్తోంది. కచ్చితంగా అధికార వైసిపి పై కసి తోనే వీరంతా ఓట్లు వేశారని స్పష్టమవుతోంది. స్వస్థలాల్లోనే వేయాలని ఒకసారి, పనిచేసిన చోటే వేయాలని మరోసారి కన్ఫ్యూజ్ చేసినా.. ఆ రెండు వర్గాలు పెద్దగా విసుగు చెందలేదు. ఎంతో సహనంతో ఓటు వేశారు. కొన్ని జిల్లాల్లో అయితే శత శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

    కౌంటింగ్ లో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అంటే తొలి రౌండులలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకం కానున్నాయి. ఈ లెక్కన అధికార వైసిపికి.. ప్రారంభ రౌండు నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. సాధారణంగా 500 నుంచి 3000 ఓట్లు వరకు మెజారిటీ వచ్చే స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికార వైసీపీని కలవరపెడుతున్నాయి. అందుకే ఈ ఓట్లు వీలైనంతవరకు చెల్లుబాటు కాకుండా చూడాలని వైసిపి భావించింది. అన్ని విధాలా ప్రయత్నాలు చేసింది. ఎలక్షన్ కమిషన్ ఈ ఓట్ల విషయంలో, ప్రతి ఓటు చెల్లుబాటు అవ్వాలని ఉద్దేశంతో ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ అభ్యంతరం చెబుతోంది. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

    ఇప్పుడు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చుట్టూ రాజకీయం నడుస్తోంది. శత శాతం వారి ఓట్లు చెల్లుబాటు కావాలని టిడిపి కూటమి భావిస్తోంది. అందుకే రిటర్నింగ్ అధికారి హోదా, సీల్ లేకపోయినా.. సంతకాన్ని ప్రాతిపదికగా తీసుకుని.. ప్రతి ఓటు చెల్లుబాటు అయ్యే విధంగా చూడాలని ఈసీని కోరింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వైసిపి సీఈసీకి లేఖ రాసింది. సీఈసీ సైతం అన్ని ఓట్లు చెల్లుబాటు కావాలన్న రీతిలో ఆదేశాలు ఇచ్చింది.దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది వైసిపి. కేవలం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకు పడవని భావించి.. వైసిపి మొండి పట్టుదలతో ముందుకు సాగుతోంది. అయితే ఓట్లు చెల్లుబాటు కోసమే ఈ ఆదేశాలు కావడంతో న్యాయస్థానం పట్టించుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. శత శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు అయితే వైసీపీకి తొలి రౌండ్ నుంచి కౌంట్ డౌన్ మొదలైనట్టే.