MLA Kolikapoodi Srinivasarao : టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వెనక్కి తగ్గారు. గత కొద్దిరోజులుగా ఆయన చర్యలు వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. హై కమాండ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఆయనపై చర్యలు తప్పవని ప్రచారం సాగింది. ఆయన స్థానంలో ఇన్చార్జిని నియమిస్తారని కూడా టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, వర్ల రామయ్య, సత్యనారాయణ రాజు తదితరులు కొలికపూడి శ్రీనివాసరావు తో మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గంలో జరిగిన పరిణామాలపై వివరణ కోరారు. దీంతో ఈ అంశంపై హై కమాండ్ సీరియస్ గా ఉందని ఆయనకు అర్థమైంది. అందుకే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తన పనితీరు మార్చుకుంటానని స్పష్టం చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతానని కూడా వారికి వివరించే ప్రయత్నం చేశారు. క్యాడర్ తో సమన్వయ లోపం ఏర్పడిందని ఒప్పుకున్నారు. నావల్ల కొందరికి ఇబ్బందులు వస్తాయని ఊహించలేదన్నారు. ఆదివారం తిరువూరు నియోజకవర్గ టిడిపి శ్రేణులతో సమావేశం అవుతానని చెప్పారు. తన వల్ల పార్టీ శ్రేణులకు ఎదురైన ఇబ్బందులను సరి చేసుకుంటానని బదులిచ్చారు. దీంతో మరోసారి కొలికపూడి వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే వరుసుగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. కొందరు మీడియా ప్రతినిధులు ఉన్నారన్నది కొలికపూడి ఆరోపణ. ఈ నేపథ్యంలో తమపై ఎమ్మెల్యే కొలికపూడి అనుచిత వ్యాఖ్యలు చేశారని కొందరు మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరుకావాలని కొలికపూడికి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరైన ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
* ఉద్యమ నేపథ్యం
అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు కొలికపూడి. మంచి వాగ్దాటి ఉండడంతో చంద్రబాబు సైతం పిలిచి టిక్కెట్ కేటాయించారు. విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. టిడిపి అభ్యర్థిగా ఆయన సోదరుడు శివనాథ్ పోటీ చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను బరిలోదించాలని చూసారు. ఈ నేపథ్యంలోనే తిరువూరు నుంచి కొలికపూడి పేరును సిఫారసు చేశారు. చంద్రబాబు అంగీకరించడంతో అభ్యర్థిగా మారారు.
* ఆది నుంచి వివాదాస్పదం
అయితే ఆది నుంచి కొలికిపూడి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. డ్వాక్రా మహిళలను గంటల తరబడి పోలీస్ స్టేషన్లో ఉండేలా ఆదేశాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఓవైసీపీ నేత ఇంటిపై యంత్రాలతో దండెత్తారని.. అక్రమ నిర్మాణం పేరిట ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సొంత పార్టీకి చెందిన సర్పంచ్ ను చెప్పుతో కొడతానని హెచ్చరించడంతో ఆయన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మరోవైపు ఆయనపై మహిళలు లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసనకు కూడా దిగారు. ఇవన్నీ మరువక ముందే మీడియా ప్రతినిధుల పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి.అయితే ఈ పరిణామాలన్నీ టిడిపి హై కమాండ్ సీరియస్ గా తీసుకోవడంతో కొలికపూడి సస్పెన్షన్ తప్పదు అని అంతా భావించారు. అయితే తన తప్పులను తెలుసుకొని సరిదిద్దుకుంటానని ఆయన బదులు ఇవ్వడంతో.. టిడిపి హాయ్ కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.