Telangana Hight Court : తెలంగాణ హైకోర్టు సంచలనం..మార్గదర్శి విషయంలో ఉండవల్లి వెనక్కి తగ్గినట్టేనా..

దాదాపు 20 సంవత్సరాలు కావస్తోంది..మార్గదర్శి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాటం చేయబట్టి.. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడి లాగా ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి విషయంలో రామోజీరావును దెబ్బతీసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత ఏడాది ఏపీ లో జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి.. ఉండవల్లి అరుణ్ కుమార్ యోచించినట్టుగా ఏపీ సిఐడి అడుగులు వేసింది.

Written By: Dharma, Updated On : October 5, 2024 7:11 pm

Telangana Hight Court

Follow us on

Telangana Hight Court : ఏపీలో ప్రభుత్వం మారడంతో మారదర్శి వ్యవహారం కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది. ఈ క్రమంలో మళ్లీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు.. మార్గదర్శిలో జరిగిన వ్యవహారాల గురించి పరిశీలన చేయాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది.. దీంతో హైకోర్టు బెంచ్.. రిజిస్టార్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేయించింది. ” మార్గదర్శి ద్వారా ఎవరైనా మోసపోయారా? మెచ్యూరిటీ పూర్తయినా మార్గదర్శి యాజమాన్యం డబ్బులు చెల్లించలేదా? మార్గదర్శి యాజమాన్యం డబ్బులు చెల్లించని పక్షంలో సంప్రదించండి” అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది. దేశంలోని ప్రఖ్యాత పత్రికలలో ఆ ప్రకటన ప్రచురితమైంది. ఈ ప్రకటనలో నిర్దిష్టంగా అక్టోబర్ ఒకటో తేదీ వరకు గడువును కూడా విధించింది. ఆ గడువు పూర్తయి నేటికీ అక్షరాల నాలుగు రోజులు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ రాలేదు. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయిందని మార్గదర్శి ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఐదు కోట్లు ప్రత్యేక ఖాతాలో జమ చేసింది..

2004 నుంచి మార్గదర్శి వివాదాన్ని పలు రూపాలలో ఉండవల్లి అరుణ్ కుమార్ లాగుతున్నారు. ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మార్గదర్శి యాజమాన్యం ఒకింత ఉక్కపోతను ఎదుర్కొంది. ఆ తర్వాత ప్రభుత్వాలు మార్గదర్శి వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవహారంలోకి సిఐడిని ఎంట్రీ చేయించారు. మార్గదర్శి యాజమాన్యాన్ని ఎంతలా ఇబ్బంది పెట్టాలో.. అంతలా పెట్టారు. కానీ ఈ కేసు చివరి దశలో ఉండగా జగన్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. మళ్లీ ఇప్పుడు ఈ వ్యవహారాన్ని లాగడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు దాకా వెళ్లడం.. హైకోర్టు ప్రకటన ఇచ్చినప్పటికీ..ఎవరూ మాకు డబ్బులు చెల్లించలేదని రాకపోవడంతో ఉండవల్లి అరుణ్ కుమార్ దూకుడు బ్రేక్ పడింది.. బకాయిలు ఎలాగూ లేవు కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ 45 ఎఫ్ అనే పల్లవి అందుకుంటారని ఆర్థిక మేధావులు అంటున్నారు. మార్గదర్శి లోని డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించడానికి యాజమాన్యం అయిదు కోట్లు అప్పట్లో ప్రత్యేకమైన ఖాతాలో జమ చేసిందని.. ప్రతినెల ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తున్నదని.. ఇలాంటి సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని మార్గదర్శి ఉద్యోగులు అంటున్నారు. అంటే ఈ మొత్తం ఎపిసోడ్ తో ఇంకపై ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి పేరు ఎత్తే అవకాశం లేదని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు. అయితే ఇన్నాళ్లు మార్గదర్శి వ్యవహారం ద్వారా రామోజీరావును ఉండవల్లి అరుణ్ కుమార్ ఇబ్బంది పెట్టారని.. ఇకపై ఆ సమస్య ఉండదని ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు.