Kodi Kathi Case: కోడి కత్తి కేసు నిందితుడు ఆరోగ్యం పై ఆందోళన

గత ఐదు సంవత్సరాలుగా కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. కానీ జగన్ మాత్రం లోతైన దర్యాప్తు జరగాలని కోరుతున్నారు.

Written By: Dharma, Updated On : January 21, 2024 5:24 pm

Kodi Kathi Case

Follow us on

Kodi Kathi Case: విశాఖ సెంట్రల్ జైల్లో ఏం జరుగుతోంది? కోడి కత్తి కేసు నిందితుడు దీక్షలో ఉన్నాడని బంధువులు చెబుతున్నారు. అటువంటిదేమీ లేదని జైలు అధికారులు ప్రకటించారు. జైల్లో శ్రీనివాసరావు ఆహారం తీసుకుంటున్నాడని చెబుతున్నారు. మరోవైపు ములాఖత్ లో గుర్తు తెలియని వ్యక్తులు కలిశారని.. వారు ఎవరో చెప్పాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. జైలులో శ్రీనివాసరావు ఆరోగ్యం పై ఆందోళన చెందుతున్నారు. దీనిపై జైలు అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గత ఐదు సంవత్సరాలుగా కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. కానీ జగన్ మాత్రం లోతైన దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. కోర్టు విచారణకు హాజరు కావడం లేదు. సాక్ష్యం చెప్పేందుకు కూడా ముందుకు రావడం లేదు. దీంతో నిందితుడు శ్రీనివాసరావుకు జైలు నుంచి విముక్తి లభించడం లేదు. కనీసం బెయిల్ కూడా దక్కడం లేదు. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావు తో పాటు ఆయన తల్లి, సోదరుడు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల 18 నుంచి జైల్లో శ్రీనివాసరావు.. విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యులు దీక్షకు దిగారు. కుటుంబ సభ్యుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కానీ శ్రీనివాసరావు విషయంలో మాత్రం స్పష్టత లేదు.

శ్రీనివాసరావు దీక్షను అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. జైలు వద్ద దళిత సంఘాల నేతలు ప్రదర్శించడం, ములాఖత్ కోరడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తరువాత భద్రతను కట్టుదిట్టం చేశారు. దళిత సంఘాల ప్రతినిధులతో శ్రీనివాసరావు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకునేందుకు ఓ అధికారిని సైతం నియమించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో జైలు అధికారుల ప్రకటనలు సైతం భిన్నంగా ఉన్నాయి. జైలులో శ్రీనివాసరావు ఆహారం తీసుకుంటున్నాడని ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. అంతకుముందే ములాఖత్ లో కలిసిన దళిత సంఘాల ప్రతినిధులకు తాను దీక్షలో ఉన్నట్లు శ్రీనివాసరావు చెప్పాడు. అక్కడకు కొద్ది సమయానికి అధికారులు అటువంటిదేమీ లేదని ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది.

జైల్లో ఉన్న ఖైదీలను కలిసేందుకు వారానికి రెండు సార్లు అనుమతి ఉంటుంది. ఆ సమయంలోనే బంధుమిత్రులు కలుస్తారు. అయితే విశాఖకు చెందిన దళిత సంఘం ప్రతినిధి ఒకరు శ్రీనివాసరావును కలిశారు. కానీ ములాఖత్ జాబితాలో రెండో పేరు ఒకటి కనిపిస్తోంది. అలా కలిసింది ఎవరు? ఏమిటి? అనే దానిపై స్పష్టత లేదు.ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు ఆరోగ్యం పై హెల్త్ బుల్లెట్ విడుదల చేయాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.