Janga Krishna Murthy: జంగా కృష్ణమూర్తి జంప్.. ఏ పార్టీలోకంటే?

జంగా కృష్ణమూర్తి బలమైన బీసీ నాయకుడు. యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. వచ్చే ఎన్నికల్లో జగన్ తనకే టిక్కెట్ ఇస్తారని.. తానే పోటీ చేస్తానని కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు.

Written By: Dharma, Updated On : January 21, 2024 5:19 pm

Janga Krishna Murthy

Follow us on

Janga Krishna Murthy: సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి వైసీపీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ విషయంలో వైసిపి హై కమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధపడినట్లు సమాచారం. గతంలో గురజాల నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. వైసిపి ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచారు. గత ఎన్నికల్లో గురజాల టికెట్ ను ఆశించారు. టికెట్ ఇవ్వకపోయినా వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ హై కమాండ్ మాత్రం పట్టించుకోవడం లేదు.

జంగా కృష్ణమూర్తి బలమైన బీసీ నాయకుడు. యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. వచ్చే ఎన్నికల్లో జగన్ తనకే టిక్కెట్ ఇస్తారని.. తానే పోటీ చేస్తానని కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు. గురజాలలో జంగా కృష్ణమూర్తికి మంచి పట్టు ఉంది. అయితే ఇటీవల వైసిపి సాధికార బస్సు యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ గురజాలలో మాత్రం యాత్ర జరగలేదు. కృష్ణమూర్తి సహకరించకపోవడం వల్లే అక్కడ బస్సు యాత్ర నిర్వహించలేదని వార్తలు వచ్చాయి.

జంగా కృష్ణమూర్తికి న్యాయం చేయడంలో జగన్ ఆలస్యం చేశారు. రాజ్యసభ పదవి కానీ.. టిటిడి చైర్మన్ పదవి కానీ ఇవ్వాలని జంగా కృష్ణమూర్తి కోరుతూ వచ్చారు. కానీ ఆయనకు ఎమ్మెల్సీ కట్టబెట్టి చేతులు దులుపుకున్నారు. అందుకే కృష్ణమూర్తి ఈసారి గురజాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని డిసైడ్ అయ్యారు. కానీ జగన్ మాత్రం కాసు మహేష్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అదే జరిగితే జంగా కృష్ణమూర్తి పార్టీని వీడేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. టిడిపిలో చేరనున్న పార్థసారధికి జంగా కృష్ణమూర్తి టచ్ లోకి వచ్చారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గురజాల టిక్కెట్ ను యరపతినేని శ్రీనివాసరావుకు టిడిపి దాదాపు ఖరారు చేసింది. దీంతో టీడీపీలో టికెట్ దక్కే అవకాశం జంగా కృష్ణమూర్తికి లేదు. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. షర్మిల పిసిసి బాధ్యతలు తీసుకుంటున్న తరుణంలో వైసీపీ నుంచి కాంగ్రెస్ కు వెళ్లే నేతల జాబితాలో జంగా కృష్ణమూర్తి ఉండడం విశేషం. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.