Comedian Ali : పవన్ కు దగ్గర కావాలని అలీ భావిస్తున్నారా? అందుకే వైసిపికి దూరమయ్యారా? తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారా? ఇదంతా పవన్ కు దగ్గర అయ్యేందుకేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి పవన్, అలీ మంచి మిత్రులు. వారిద్దరిది మంచి కాంబినేషన్. పవన్ సినిమాల్లో అలీ ఉండాల్సిందే. అలీ లేని తన సినిమా ఉండదని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అంత మంచి బాండింగ్ వారిది. కానీ రాజకీయాల పుణ్యమా అని ఆ ఇద్దరు స్నేహితులు దూరమయ్యారు. పవన్ జనసేన ఉండగా.. అలీ వైసీపీ బాట పట్టారు. అదే వారి మధ్య గ్యాప్ నకు కారణమైంది. ఇద్దరినీ దూరం చేసింది. ఇప్పుడు వైసీపీ ఓటమిపాలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
* రాజకీయాలకు గుడ్ బై
తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని అలీ ప్రకటించారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా కించపరచలేదని కూడా చెప్పుకొచ్చారు. దీంతో అలీపై ఒక రకమైన అభిప్రాయం మారింది. వైసిపి ఐదేళ్ల పాలనలో అలీకి అనుకున్న స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇస్తారని ఆశపెట్టారు. కానీ చివరకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవికి పరిమితం చేశారు. పోనీ మొన్నటి ఎన్నికల్లో టికెట్ అయినా ఇచ్చారా? అది లేకుండా పోయింది.
* మెగా కుటుంబంతో సాన్నిహిత్యం
వాస్తవానికి మెగా కుటుంబంతో అలీకి సన్నిహిత సంబంధాలు ఉండేవి. వారికి ఆత్మీయుడు కూడా. అటువంటిది అలీ భిన్న నిర్ణయం తీసుకున్నారు. జనసేన ఉండగా వైసీపీలో చేరారు. అయితే ఎప్పుడూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. తూలనాడుతూ మాట్లాడలేదు. అయినా సరే పవన్ తో ఉన్న స్నేహాన్ని వదులుకొని అలీ వైసీపీ పంచన చేరడం మెగా అభిమానులకు నచ్చలేదు. 2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోవడంతో అందరూ ఎగతాళి చేశారు. అదో పార్టీయా అన్నట్టుగా మాట్లాడారు. ఎన్నెన్నో అవమానాలు చేశారు. అదే పార్టీలో అలీ ఉండడంతో.. ఆయన సైతం జన సైనికులకు టార్గెట్ అయ్యారు. ప్రస్తుతం అలీ పవన్ కు అనుకూలంగా వ్యాఖ్యానాలు చేస్తున్న జనసైనికులు మాత్రం ఆహ్వానించడం లేదు.
* పవన్ కు అనుకూల వ్యాఖ్యలు
ఇటీవల వరుసగా అలీ పవన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన సుమ హోస్టుగా ఉన్న ఓ సోలో మాట్లాడారు. ఎవరితో నటించేందుకు కంఫర్ట్ గా ఫీల్ అవుతారని అడగగా మారు మాట చెప్పకుండా పవన్ పేరు చెప్పారు. ఇటీవల రెండు రోజుల కిందట ఓ సినిమా వేడుకలో పవన్ తో మీ బంధం ఎలా ఉంది? అని అడిగితే మూడు పువ్వులు ఆరు కాయలు అంటూ సమాధానం ఇచ్చారు. పవన్తో నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. తాను నటించడానికి ఉన్నానని చెప్పుకొచ్చాడు. పవన్ కు అలీ దగ్గరయ్యేందుకు ఆ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని జన సైనికులు అనుమానిస్తున్నారు. అయితే వైసీపీలో ఉన్నప్పుడు అలీ చర్యలను వ్యతిరేకించారు జనసైనికులు. కానీ ఇప్పుడు మాత్రం ఆహ్వానిస్తున్నారు.