Anna Canteen : అన్న క్యాంటీన్లో కుటుంబ సభ్యులతో కలెక్టర్ భోజనం.. అక్కడున్నవారు ఫిదా.. చంద్రబాబు ఫోన్!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బ్యూరోక్రసీ వ్యవస్థకు సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కలెక్టర్లు, ఎస్పీలు స్వేచ్ఛగా పనిచేయడం ప్రారంభించారు.

Written By: Dharma, Updated On : August 27, 2024 1:34 pm

Anna Canteen

Follow us on

Anna Canteen : ఏపీలో ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఆగస్టు 15 నాడు ప్రారంభించింది. ఈ క్యాంటీన్లకు సామాన్య ప్రజలు పోటేత్తుతున్నారు. 15 రూపాయలకే మూడు పూటల ఆహారం లభిస్తుండడంతో ఆసక్తి చూపుతున్నారు. శుచి, శుభ్రతకు పెద్దపీట వేస్తుండడంతో ప్రజలు అన్న క్యాంటీన్లో తినేందుకు మొగ్గు చూపుతున్నారు. చిరు వ్యాపారులు, ఆటో కార్మికులు, నిరుద్యోగ యువత ఎక్కువగా క్యాంటీన్ల వైపు మొగ్గు చూపుతోంది. గత కొద్దిరోజులుగా ఈ క్యాంటీన్లను తరచూ ప్రజాప్రతినిధులు సందర్శిస్తున్నారు. స్వయంగా భోజనాలను వడ్డిస్తున్నారు. అయితే తాజాగా కృష్ణాజిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులు అన్న క్యాంటీన్ కి వెళ్లి ఆహారం తినడం ఆసక్తికరంగా మారింది. సోమవారం మధ్యాహ్నం కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, భార్య, కుమార్తెతో మచిలీపట్నం అన్న క్యాంటీన్ కి వచ్చారు. స్వయంగా మూడు టోకెన్లు తీసుకొని.. క్యూలో నిలబడి భోజనం చేశారు. అయితే ఇంతవరకు కలెక్టర్లు క్యాంటీన్లో భోజనం చేసింది లేదు. నాయకులు మాత్రం తరచుగా వెళ్లడం చేస్తున్నారు. దీంతో కృష్ణా కలెక్టర్ ప్రత్యేకంగా నిలిచారు. సామాన్యులు మాదిరిగానే క్యాంటీన్లో భోజనం చేయడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

* నాయకుల సందడి మామూలే
సాధారణంగా రాజకీయ నాయకులు ఇటువంటి చోట్ల సందడి చేస్తుంటారు. రాజకీయంగా ప్రజల మద్దతు కోసం, ప్రచారం కోసం అలా చేస్తుంటారు. కానీ జిల్లా కలెక్టరే కుటుంబ సభ్యులతో స్వయంగా అన్నా క్యాంటీన్ కి వచ్చి భోజనం చేయడం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడ భోజనాలు చేస్తున్న వారితో మాట్లాడారు. ఆహార పదార్థాల నాణ్యత గురించి తెలుసుకున్నారు. క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడి ప్రజలకు మెరుగైన ఆహారం అందించాలని ఆదేశించారు.

* సోషల్ మీడియాలో వైరల్
ఓ జిల్లా కలెక్టర్ అన్న క్యాంటీన్లో తినడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారం సీఎం చంద్రబాబు వద్దకు వెళ్ళింది. దీంతో ఆయన వెంటనే స్పందించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కలెక్టర్లు అన్న క్యాంటీన్లకు తరచూ వెళ్లడం ద్వారా అక్కడ పరిస్థితులు తెలుస్తాయని.. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

* కలెక్టర్లకు స్వేచ్ఛ
ఇటీవల చంద్రబాబు అన్ని జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. పాలనలో వీలైనంతవరకు రాజకీయ జోక్యం ఉండదని.. కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు.. పాలనలో తమ మార్కు చూపించాలని.. ఉత్తమ సేవలందించిన కలెక్టర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని కూడా చంద్రబాబు తేల్చి చెప్పారు. 1995 నాటి చంద్రబాబును చూస్తారని.. మీరు కూడా పాలనలో మార్పు చూపించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అయితే కృష్ణాజిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులకు అన్న క్యాంటీన్లో భోజనం చేయడం వైరల్ అంశంగా మారింది. దీనిని అధికారులు స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించడం విశేషం.