Telegram : భారత్ లోనూ టెలిగ్రామ్ పై నిషేధం విధిస్తారా? ఆ సంస్థ సీఈవో అరెస్ట్ తో హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం..

సోషల్ మీడియా విస్తృత వ్యాప్తి నేపథ్యంలో.. అనేక యాప్స్ వాడుకలో ఉన్నాయి. అందులో విశేషమైన ఆదరణ పొందిన వాటిలో టెలిగ్రామ్ ఒకటి.. మెసేజింగ్ ప్లాట్ ఫాం గా టెలిగ్రామ్ కు పేరు ఉంది. అయితే ఈ సంస్థ సీఈవో, వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ అరెస్టు కావడంతో ఒక్కసారిగా సంచలనం నెలకొంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 27, 2024 1:33 pm

Telegram CEO

Follow us on

Telegram:  టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ ను గత శనివారం పారిస్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు.. అజర్ బైజాన్ ప్రాంతం నుంచి పారిస్ లోని విమానాశ్రయానికి దురోవ్ చేరుకున్న నేపథ్యంలో.. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని వెంటనే తమ అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం నెలకొంది.. వాస్తవానికి పావెల్ దురోవ్ పేరు మోసిన నేరస్థుడు కాకపోయినప్పటికీ.. అతడు నెలకొల్పిన టెలిగ్రామ్ యాప్ ద్వారా మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు, పిల్లలపై లైంగిక దోపిడీ జరుగుతున్నట్టు, మోసాలకు సంబంధించిన సమాచారం వ్యాప్తి జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో దురోవ్ అరెస్టు అయ్యాడు. అయితే అతని అరెస్టు అనంతరం పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి..

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏం నిర్ణయం తీసుకుంటుందంటే..

అంతర్జాతీయ మీడియాలో ఈ నివేదికలపై విస్తృతంగా వార్తలు ప్రసారం కావడంతో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మరికొన్ని నేరాలు కూడా వెలుగులోకి రావడంతో భారత ప్రభుత్వం ఒక్కసారిగా మేల్కొంది. ఈ సామాజిక మాధ్యమ వేదికపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. టెలిగ్రామ్ పై చర్యల కోసం అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ప్రకారం టెలిగ్రామ్ పై భారత్ లో కూడా నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలోనూ భారత్ లో నిర్వహించే కార్యకలాపాల విషయంలో టెలిగ్రామ్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. పిల్లలకు సంబంధించి లైంగిక వేధింపులకు పాల్పడే విషయాలను టెలిగ్రామ్ నుంచి తొలగించాలని అప్పట్లోనే భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది.. అయితే టెలిగ్రామ్ యాప్ ఈ విషయాన్ని పక్కన పెట్టింది.. మరోవైపు దురోవ్ అరెస్టు నేపథ్యంలో ట్విట్టర్ ఎక్స్ అధినేత మస్క్ స్పందించాడు.” ఐరోపా సమాఖ్య చట్టాలు, డిజిటల్ సర్వీస్ యాక్ట్ ఆధారంగా అతనిని అరెస్టు చేశారు. కంటెంట్ మోటివేషన్ లో భాగంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇది వినడానికి, చదవడానికి చాలా బాగుంది.. సామాజిక మాధ్యమ వేదికలో సమాచార వ్యాప్తికి సంబంధించి దుర్వినియోగం జరిగితే సంస్థకు ఎలాంటి సంబంధం ఉంటుంది? దానికి యజమాని ఎందుకు బాధ్యత వహించాలి? దురోవ్ ను విడుదల చేయాలి.. మోడరేషన్ పేరుతో నిజాలను తొక్కి పెడుతున్నారని” ఫ్రెంచ్ భాషలో చేసిన ట్వీట్లో మస్క్ పేర్కొన్నాడు. దురోవ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతడు ఏర్పాటు చేసిన సామాజిక మాధ్యమాల్లో నేరమయ సందేశాలు వ్యాప్తిలో ఉన్నాయని కొందరు ఆరోపిస్తుంటే.. అతడి అరెస్టు సరికాదని మరికొందరు పేర్కొంటున్నారు.