Prashant Kishor: రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ అవసరాల కోసం రాజకీయ నాయకులు పది మెట్లు దిగుతారు లేదా పది మెట్లు ఎత్తారు. కానీ అంతిమంగా తమకు కావాల్సింది దక్కించుకుంటారు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే.. అక్కడికే వస్తున్నాం ఆగండి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం తారా స్థాయికి చేరిన నేపథ్యంలో.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు, ప్యాకేజి స్టార్, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని ధ్వజమెత్తుతున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే అయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ మీద అసలు జగన్ మోహన్ రెడ్డికి కోపం లేదా? ఆయనతో పొత్తు కోసం తాపత్రయపడ్డారా? దానికి సంబంధించి సంకేతాలు పంపించారా? అప్పట్లో మధ్యవర్తిత్వం నడిపింది ఎవరు? వీటన్నింటికీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టేలా సమాధానాలు చెప్పారు.
అప్పట్లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సానుభూతిపరులు ఎక్కువుంటారు. అయినప్పటికీ టిడిపి విజయం సాధించింది. సహజంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి ఫేవర్ గా ఉంటాయి. అయితే ఆ ఎన్నికల్లో కూడా ఫలితాలు అధికార టిడిపికి అనుకూలంగా వచ్చాయి. మిగతా ప్రతిపక్ష నాయకులైతే ఏమో గాని.. జగన్ మాత్రం ఆ ఓటమిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. చాలా రోజులపాటు తీవ్రంగా ఆలోచించారు. అప్పటికి ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఒకరోజు ప్రశాంత్ కిషోర్ ను తన వద్దకు పిలిపించుకున్నారు. నంద్యాల ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ తో పొత్తు కుదుర్చుకునేందుకు తాను సిద్ధమని, అవసరమైతే సహాయం చేయాలని ప్రశాంత్ కిషోర్ ను కోరారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియదు గానీ.. ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ఇటీవల ప్రకటించారు.. త్వరలో ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కొద్ది రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్ జగన్ పై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. 2019లో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పని చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘనవిజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ప్రశాంత్ కిషోర్ జగన్ కాంపౌండ్ నుంచి బయటికి వచ్చారు. మధ్యలో చంద్రబాబుతో సంప్రదింపులు జరిగినప్పటికీ.. అవి అక్కడితోనే ఆగిపోయాయి. అప్పటి నుంచే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా అటువంటివే. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. టిడిపి కి ప్రశాంత్ కిషోర్ అమ్ముడుపోయారని.. అందువల్లే జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ తో రాయబారం నడిపారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన తాలూకూ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.