WPL 2024: ఒక్క పరుగు ఢిల్లీ రాతను మార్చేసింది.. ఆర్సీబీని ఓడించింది

ప్లే ఆప్స్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు చేతులెత్తేశారు ఢిల్లీ బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ఢిల్లీ జట్టులో ఓపెనర్లు మెగ్ లానింగ్ (29), షాఫాలీ వర్మ (23), తొలి వికెట్ కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Written By: Suresh, Updated On : March 11, 2024 8:54 am

WPL 2024

Follow us on

WPL 2024: అసలు టి20 మజా అంటే ఇది. అభిమానులను మునివేళ్లపైన నిలబెట్టింది. క్షణక్షణం ఉత్కంఠ కలిగించింది. ఏదో థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు, సస్పెన్స్ వెబ్ సిరీస్ వీక్షిస్తున్నట్టు.. మైదానంలో ఆటగాళ్లు.. మైదానం బయట వీక్షకులు.. అందరిలోనూ ఒకటే టెన్షన్.. చివరికి ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ రాత మారిపోయింది. Women’s premier league-24 లో ఢిల్లీ జట్టు ప్లే ఆప్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్లో బెంగళూరుకు ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ పది పాయింట్లు ప్లే ఆప్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జేమీమా రోడ్రిగ్స్ నిలిచింది.

చేతులెత్తేసిన బెంగళూరు బౌలర్లు

ప్లే ఆప్స్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు చేతులెత్తేశారు ఢిల్లీ బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ఢిల్లీ జట్టులో ఓపెనర్లు మెగ్ లానింగ్ (29), షాఫాలీ వర్మ (23), తొలి వికెట్ కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత జేమీమా రోడ్రిగ్స్ (58), అలీస్ క్యాప్సి (48) దూకుడు గా ఆడారు. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఒకానొక దశలో వీరి విధ్వంస బ్యాటింగ్ కు ఢిల్లీ 13 ఓవర్లకే 100 పరుగులు చేసింది. ముఖ్యంగా మొలినేక్స్ వేసిన 13వ ఓవర్లో రోడ్రిగ్స్ ఏకంగా మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాది ఢిల్లీ స్కోర్ ను రాకెట్ వేగంతో పరుగులు పెట్టించింది. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇక బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ నాలుగు వికెట్లు తీసింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టు ముందుగా తడబడింది. ఆ తర్వాత తేరుకుని ఇన్నింగ్స్ ధాటిగా ఆడటం ప్రారంభించింది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కెప్టెన్ స్మృతి మందాన ఐదు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచింది. మోలినెక్స్(33), పెర్రీ(49) జోడి రెండో వికెట్ కు 80 పరుగులు జత చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత డివైన్ (26), రీఛా ఘోష్ (51) ఎదురుదాడికి దిగారు. చివరి ఓవర్ లో బెంగళూరు జట్టుకు 17 పరుగులు కావలసి వచ్చింది. రిచా రెండు సిక్స్ లు బాదినప్పటికి ఉపయోగం లేకుండా పోయింది. చివరి బంతికి సింగిల్ కోసం ప్రయత్నించిన రీచా.. రన్ అవుట్ అయింది. దీంతో బెంగళూరు ఓడిపోక తప్పలేదు. ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడంతో ఢిల్లీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు..