Chandrababu SIT probe: ఏపీలో ( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతోంది. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కొందరు నేతలు చేస్తున్న పనులతో ప్రభుత్వంతోపాటు పార్టీలకు చెడ్డ పేరు వస్తోంది. అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ నేతలను సైతం విడిచిపెట్టడం లేదు. వారిపై సైతం చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కల్తీ మద్యం ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న టిడిపి నేతలపై చర్యలకు ఉపక్రమించింది నాయకత్వం. తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతటితో ఆగకుండా ప్రధాన నిందితులను సైతం అరెస్టు చేశారు. మరోసారి ఈ ఘటన పునరావృత్తం కాకుండా కఠిన చర్యలకు దిగుతున్నారు. అయితే కల్తీ మద్యం వెనుక కుట్ర కోణం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే డిఐజి స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని విచారణకు నిమిత్తం నియమించింది ఏపీ ప్రభుత్వం.
గట్టి చర్యలతో హెచ్చరికలు..
అయితే గతంలో ఈ దందాకు అలవాటు పడినవారు తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) చేరిన వారు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని విడిచి పెట్టేది లేదన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారు. టిడిపి నేతలు అనే ట్యాగ్ పెట్టుకుని తప్పుడు పనులు చేస్తే సహించేది లేదని గట్టి సంకేతాలు పంపారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది సాహసమైన చర్య. గతంలో వైసీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క విచారణ కూడా జరగలేదు. తాడేపల్లిగూడెంలో 20 మందికి పైగా కల్తీ మద్యంతో చనిపోయారు. కానీ దానిపై ఎటువంటి విచారణ కూడా లేదు. అప్పట్లో నాసిరకం మద్యం తాగి వేలాదిమంది చనిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వైసీపీ ఎదురుదాడి చేసిందే కానీ.. దానిపై విచారణ చేసి నిజనిర్ధారణ చేయలేదు. అనుమానాలను నివృత్తి చేయలేదు.
అప్పట్లో చాలా ఘటనలు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో చాలా రకాల ఘటనలు జరిగాయి. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాయి. వాటిపై విచారణలు జరిపించలేదు జగన్మోహన్ రెడ్డి. సొంత పార్టీ ఎమ్మెల్సీ ఒకరు తన కారు డ్రైవర్ను హత్య చేయించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లారు. కనీసం ఆయనను పార్టీ నుంచి సీరియస్ గా సస్పెండ్ చేయలేదు. విచారణ సవ్యంగా సాగించలేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కూడా అలానే సాగింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా సహాయం అందించలేదు. అప్పట్లో చంద్రబాబు ఇంటిపై దండయాత్ర, కుప్పంలో అడ్డగింత, పట్టాభి ఇంటిపై దాడి, పల్నాడులో పిన్నెల్లి అనుచరుల దాడులు.. ఇలా ఏ ఒక్కదానిపై కూడా స్పందించిన దాఖలాలు లేవు. సొంత పార్టీ వారిని మందలించలేదు. ప్రభుత్వ వైఫల్యాలు వెలుగు చూసినప్పుడు విచారణలకు ఆదేశించలేదు. కానీ తప్పుడు కేసుల విచారణ మాత్రం కొనసాగింది. అయితే చంద్రబాబు అలా కాదు. సొంత పార్టీ నేతలపై ఆరోపణలు రావడం, వారి వెనుక ఒక రాకెట్ ఉందన్న అనుమానం.. ఇలా అన్నింటినీ తీగలాగాలన్న ప్రయత్నంలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం సాహస పరిణామమే.