Balakrishna Latest News: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)డామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డారా? జనసైనికులను కూల్ చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్ది రోజుల కిందట నందమూరి బాలకృష్ణ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో సినీ పరిశ్రమ పెద్దలకు అవమానం జరిగిందని.. అప్పట్లో సీఎం జగన్ అవమానించారని బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవి గట్టిగా అడగడం వల్లే అప్పట్లో జగన్ కాస్త వెనక్కి తగ్గారని చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో ఎవరూ గట్టిగా అడగలేదని అది తప్పు అంటూ.. చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడారు బాలకృష్ణ. దీనిపై చిరంజీవి ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగా అభిమానులు హర్ట్ అయ్యారు. చిరంజీవికి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అదే సమయంలో నందమూరి అభిమానులు సైతం రియాక్ట్ అయ్యారు. దీంతో వివాదం మరింత ముదిరింది.
పవన్ ఇంటికి చంద్రబాబు..
అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మనస్థాపానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అయితే డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో భాగంగా సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. అయితే అప్పట్లో పవన్ తో చంద్రబాబు ఇదే అంశం చర్చించారని కూడా ప్రచారం జరిగింది. ఈ ఘటన తర్వాత మెగా అభిమానుల్లో కొంతవరకు ఆగ్రహం తగ్గింది. కానీ సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ టార్గెట్ చేశారు. చిరంజీవికి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. మిమ్స్ తో పాటు అనేక రకాల రీల్స్ బాలకృష్ణకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి.
శుభకార్యానికి హాజరు..
అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై జనసైనికులతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం సాగింది. ఇటువంటి పరిస్థితుల్లో బాలకృష్ణ ఓ వేదికలో పాలుపంచుకున్నారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఇంట జరిగిన శుభకార్యానికి మంత్రి లోకేష్ తో కలిసి హాజరయ్యారు. అక్కడ ఉండే జనసేన ఎమ్మెల్యేలతో ఇట్టే కలిసి పోయారు. గతంలో ఏదీ జరగలేదన్నట్టు వారితో సరదాగా గడిపారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. దీంతో డ్యామేజ్ పూర్తిస్థాయిలో కంట్రోల్ చేయగలిగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.