CM Chandrababu: ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా.. చంద్రబాబు ఎప్పుడు పని మీదే ఉంటారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షంలో ప్రయత్నిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనతో పాటు రాజకీయాలపై అదే స్థాయిలో దృష్టి పెడతారు. క్షణం తీరిక లేకుండా గడుపుతారు. రోజులో కేవలం ఎనిమిది గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటారు. మిగతా 16 గంటలు అవిశ్రాంతంగా గడుపుతారు. అందుకే తాను ఏడు పదులకు చేరుకున్న యువకుడు నేనని చంద్రబాబు చెప్పుకుంటారు.అంతటి వయసులో కూడా ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డారు. 100 వరకు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. జూన్ 4న ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఈరోజు వరకు క్షణం తీరిక లేకుండా గడిపారు చంద్రబాబు.
ఫలితాలు వచ్చిన వెంటనే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. అటు ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఢిల్లీ వెళ్లిపోయారు. బిజెపి అగ్ర నేతలను కలిశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర క్యాబినెట్ కూర్పులో పాల్గొన్నారు. టిడిపి తరఫున మంత్రులను ఎంపిక చేశారు. ఇంతలో రామోజీరావు మృతితో హైదరాబాద్ చేరుకున్నారు. అంత్యక్రియలకు హాజరయ్యారు. అనంతరం ఢిల్లీ పయనమయ్యారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి సైతం హాజరయ్యారు.
ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన చంద్రబాబురాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టారు. అటు మూడు పార్టీల శాసనసభా పక్ష సమావేశాలను నిర్వహించారు. ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నికయ్యారు. గవర్నర్కు మద్దతు లేఖను అందజేశారు. ప్రధాని మోదీ తో పాటు జాతీయస్థాయి నాయకులకు ప్రమాణ స్వీకార ఆహ్వానాలు పంపించారు. ఈనెల 11న అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తరువాత మంత్రుల జాబితాను ప్రకటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా వంటివారికి ఆత్మీయ విందు ఇచ్చారు. ఉదయాన్నే ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోడీకి సాదరంగా ఆహ్వానం పలికారు. రోజంతా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిమగ్నం కాగా.. సాయంత్రం కొత్త క్యాబినెట్ సహచరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం తిరుపతి బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి సాయంత్రం తిరుగు ముఖం పట్టి అమరావతి చేరుకోనున్నారు. సచివాలయం ఏ బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించి ఐదు ఫైళ్లపై సంతకం చేయనున్నారు. గత కొద్దిరోజులుగా చంద్రబాబు షెడ్యూల్ను గమనిస్తే.. ఆయన పని రాక్షసుడని.. పనిని ఎంతగా ప్రేమిస్తారు తెలుస్తుంది.