Free Gas: మరో ప్రతిష్టాత్మక పథకం ప్రారంభానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత గ్యాస్ పథకానికి ఈరోజు శ్రీకారం చుట్టనుంది.సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం లోని ఈదుపురం గ్రామంలో పథకాన్ని ప్రారంభించనున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుకున్న క్రమంలో అమలు చేసేందుకు నిర్ణయించారు. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగాఉచిత గ్యాస్ పథకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు చంద్రబాబు. ప్రజలు ఎన్నికల్లో ఆశీర్వదించడంతో పథకం అమలుపై దృష్టి పెట్టారు. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికన అందరికీ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పథకం అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రజల మధ్య నుంచి ఈ పథకం ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలో శివారు నియోజకవర్గంగా ఉన్న ఇచ్చాపురం నుంచి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఆయన పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు సీఎం ఉండవల్లి లోని తన నివాసం నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. 11 25 గంటలకు ఆయన విమానంలో విశాఖకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరుతారు. 12:35 గంటలకు ఇచ్చాపురం మండలం ఈదుపురం చేరుకుంటారు. స్థానిక నాయకులతో భేటీ అనంతరం అక్కడే భోజనం చేయనున్నారు. ఒంటిగంట 50 నిమిషాలకు లబ్ధిదారులకు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ లను అందించనున్నారు.
* పింఛన్ల పంపిణీ
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. గ్యాస్ పంపిణీ చేసేందుకు శ్రీకాకుళం వస్తున్న చంద్రబాబు పనిలో పనిగా లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందించనున్నారు. మధ్యాహ్నం 2:20 నుంచి 3:20 వరకు ఈదుపురం గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. గంటసేపు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. అనంతరం తిరిగి నాలుగు గంటలకు హెలికాప్టర్లో శ్రీకాకుళం చేరుకుంటారు.
* రాత్రి బస శ్రీకాకుళంలో
ఈరోజు శ్రీకాకుళం నగరంలో సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. రేపు విజయనగరం పర్యటన ఉన్న క్రమంలో ఇక్కడే ఉండేందుకు నిర్ణయించారు. ఈదుపురం పర్యటన అనంతరం శ్రీకాకుళం చేరుకోనున్న చంద్రబాబు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆరున్నర గంటల వరకు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. సమీక్ష అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు. తరువాత రోజు శనివారం విజయనగరం బయలుదేరి వెళ్తారు.