Chargesheet against Jagan: ఆర్జీవీ.. అలియాస్ రామ్‌గోపాల్ వర్మ.. తెలుగు ప్రజలకే కాదు.. బాలీవుడ్ అభిమానులకు సుపరిచితమైన పేరు. ముఖ్యంగా 2019 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడానికి తనవంత సహకారం అందించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామ్‌గోపాల్‌వర్మ సైలెంట్ అయ్యారు. కానీ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు విచారణకు కోసం వచ్చారు. చిన్న నాయకులపై చర్యలు తీసుకుంటూ, పెద్ద నాయకులను వదిలేస్తున్న ఈ వ్యవహారం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోందని పేర్కొన్నారు.
రాజకీయ ద్వేషమా..?
రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన సంఘటన రాజకీయ కోణం నుంచి చర్చనీయాంశమైంది. వైసీపీ హయాంలో ఆయన టీడీపీ నాయకులైన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ చర్యలు రాజకీయంగా ప్రేరేపితమని టీడీపీ నాయకుడు ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు చేశారు. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పొందినప్పటికీ, హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యారు. అయితే, ఈ కేసు న్యాయపరమైన చర్య కన్నా రాజకీయ కక్ష సాధింపుగా పరిగణించబడుతోంది. వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఆర్జీవీ సమావేశం కావడం ఈ అనుమానాలను మరింత బలపరిచింది.
జగన్‌పై ఛార్జ్‌షీట్, పురోగతి శూన్యం?
మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇటీవల దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ప్రధాన సూత్రధారిగా పేర్కొనడం గమనార్హం. అయితే, ఈ కేసులో ఇప్పటివరకు జగన్‌కు నోటీసులు జారీ కాలేదు, విచారణకు హాజరయ్యే అవకాశం కూడా అస్పష్టంగా ఉంది. ఈ విషయంలో వైఎస్ షర్మిల స్వయంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం గమనార్హం. ‘చిన్న నాయకులను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు, బెయిల్‌లతో సమయం వృథా చేస్తున్నారు, కానీ ప్రధాన నిందితులపై చర్యలు లేవు. ఈ కేసు రాజకీయ ఒత్తిడి కారణంగా నీరసించినట్లు కనిపిస్తోంది, ఇది ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది అని పేర్కొన్నారు.
Also Read: ఐప్యాక్ భ్రమలోనే జగన్!
సునీత న్యాయ సునీతా పోరాటం..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి నిరంతరం పోరాటం సాగిస్తున్నారు. ఢిల్లీ నుంచి కడప వరకు ఆమె అధికారులను కలుస్తూ, న్యాయం కోసం కృషి చేస్తున్నారు. అయితే, ఈ కేసులో గణనీయమైన పురోగతి కనిపించడం లేదు. అవినాష్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నప్పటికీ, రాజకీయ ప్రభావం కారణంగా ఈ కేసు నెమ్మదిగా సాగుతున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి.
పెద్దలకు మినహాయింపు?
మిథున్ రెడ్డి, చెవిరెడ్డి వంటి వైసీపీ నాయకులపై అరెస్టులు, విచారణలు జరుగుతున్నప్పటికీ, వారు త్వరలోనే బెయిల్‌పై విడుదలవుతున్నారు. ఇది న్యాయవ్యవస్థ పరిమితులను సూచిస్తుంది. పెద్ద నాయకులైన జగన్, అవినాష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితి ప్రజల్లో ‘చిన్న చేపలను వేటాడుతూ, తిమింగలాలను వదిలేస్తున్నారు’ అనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. రాజకీయ ఒత్తిడి, శక్తివంతమైన నాయకుల ప్రభావం వల్ల న్యాయం అమలులో ఆటంకాలు ఏర్పడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మిగిలింది మూడేళ్లే..?
కూటమి ప్రభుత్వానికి మిగిలిన మూడేళ్ల కాలంలో ఈ కేసుల్లో పెద్ద నాయకులపై చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందా? మద్యం కుంభకోణం, వివేకా హత్య కేసుల్లో ప్రధాన నిందితులను విచారణకు రప్పించడం, న్యాయం అమలు చేయడం పెద్ద సవాలుగా కనిపిస్తోంది. సిట్, పోలీసు విభాగాలు ‘బిగ్ బాస్’ల వరకు చేరుకోవడానికి సమర్థవంతమైన వ్యూహాలు రూపొందించాల్సి ఉంది. లేకపోతే, ఈ కేసులు కేవలం మీడియా హైప్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.