CM Chandrababu: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోంది. పాలనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది చంద్రబాబు సర్కార్.సంక్షేమ పథకాల అమలుపై సైతం ఫుల్ పోకస్ పెట్టింది.మొన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఫుల్ క్లారిటీ వచ్చింది.సంక్షేమ పథకాలకు సంబంధించి కేటాయింపులు కూడా చేసింది ప్రభుత్వం. ప్రభుత్వపరంగా ప్రజల్లో మంచి మార్కులే పడ్డాయి. కానీ కొందరి ఎమ్మెల్యేల పనితీరుపై అభ్యంతరాలు ఉన్నాయి.ఈ తరుణంలో చంద్రబాబు కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు వివాదాలకు దూరంగా ఉండాలని నిర్దేశించారు. ఇసుక, మద్యం వ్యవహారాల్లో తలదూర్చితే సహించేది లేదని హెచ్చరించారు. అదే సమయంలో ఎమ్మెల్యేల విన్నపాలపై సానుకూలంగా స్పందించారు బాబు.వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పటి మాదిరిగానే ఫలితాలు రావాలని ఆకాంక్షించారు.అందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధుల చర్యలను ప్రజలు ఎప్పుడూ గమనిస్తూ ఉంటారని..అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు స్వాగతించరన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అదే మాదిరిగా వ్యవహరించి పదవులకు దూరమయ్యారని చెప్పుకొచ్చారు.గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించి కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని.. అందుకు ఎమ్మెల్యేలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.
* వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం
కూటమి అంతులేని విజయం సాధించింది. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.ఈ తరుణంలో పదేపదే చంద్రబాబు సొంత పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తుండడం విశేషం. గత ఐదేళ్ల వైసిపి పాలనలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.అందుకే జగన్ ఎన్నికల్లో 80 చోట్ల అభ్యర్థులను మార్చారు. అయినా ఫలితాలు సానుకూలంగా రాలేదు. ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించిన తన ముఖం చూసుకుని ప్రజలు ఓటు వేస్తారని భావించారు. కానీ అందుకు విరుద్ధ ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ అభ్యర్థులు తుడుచుపెట్టుకుపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి టిడిపి ఎమ్మెల్యేలకు రాకుండా చూసుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు.
* ఆ రెండు అంశాల జోలికి పోవద్దు
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, మద్యం పాలసీలను మార్చింది. ఆ రెండు అంశాల జోలికి పోవద్దని చంద్రబాబు పలుమార్లు పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కానీ ఎందుకో చాలామంది పెడచెవిన పెడుతూ వచ్చారు. దీనిపై చంద్రబాబుకు పదేపదే ఫిర్యాదులు వస్తున్నాయి. నిఘా వర్గాలు సైతం నివేదిస్తున్నాయి. అందుకే విసిగి వేసారి పోయిన చంద్రబాబు నేరుగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులను నిలదీయాలనికూడా సూచించారు. ఇప్పుడు తాజాగా మరోసారి సమావేశమై కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇదే ఫైనల్ వార్నింగ్ అన్నట్లు మాట్లాడారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకుంటారో? లేదో? చూడాలి.