https://oktelugu.com/

Chandrababu: టిడిపి మరో నాలుగు దశాబ్దాల ఉనికి చాటేలా.. చంద్రబాబు వ్యూహం అదే

ఓ ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాల పాటు మనగలగడం అసమాన్యం. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం దానిని అధిగమించింది. పుష్కరకాలం ఎన్టీఆర్ ఆ బాధ్యతలు చూడగా.. మూడు దశాబ్దాలకు పైగా పార్టీని నడిపించారు చంద్రబాబు.

Written By:
  • Dharma
  • , Updated On : November 1, 2024 / 11:09 AM IST

    CM Chandrababu

    Follow us on

    Chandrababu: తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు కొదువ లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకున్న నాయకులు కూడా ఉన్నారు. చంద్రబాబుతో సమకాలీకులు కూడా ఉన్నారు. చంద్రబాబు సర్కారులో కీలక పదవులు అనుభవించిన వారు ఉన్నారు. అయితే చాలామంది సీనియర్లు రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సీనియర్లు పక్కకు తప్పుకున్నారు. తమకు తాముగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. చాలామంది తమ వారసులను తెరపైకి తెచ్చారు. అయితే ఇక్కడే ఒక పరిణామం. ఎన్నికల్లో పోటీ చేసి చాలామంది సీనియర్లు గెలిచారు కూడా. కానీ వారికి సైతం మంత్రి పదవులు దక్కలేదు. అటు నామినేటెడ్ పదవుల్లో సైతం యువతకు ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. దాదాపు అన్ని కొత్త మొఖాలే. తెలుగుదేశం పార్టీ మరో నాలుగు దశాబ్దాల పాటు ఉనికి చాటుకోవాలంటే.. యంగ్ జనరేషన్ కు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నారా లోకేష్ ను దృష్టిలో పెట్టుకొని సైతం యంగ్ టీంను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు సన్నిహిత నేతలు సైతం అలా పక్కకు తప్పుకున్నారు. వారి ప్లేసులో వారసులు వచ్చారు. చంద్రబాబుకు తండ్రులు సపోర్ట్ చేస్తే.. లోకేష్ కు తనయులు ఇప్పుడు మద్దతుగా నిలవడం విశేషం. ఇదంతా పక్కా ప్లాన్ తోనే జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    * తొలిసారిగా ఎన్నికైన వారికి మంత్రి పదవులు
    ఈసారి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన పదిమందికి మంత్రి పదవులు దక్కాయి. చంద్రబాబుతో పోటీగా రాజకీయం చేసిన హేమాహేమీలను సైతం పక్కన పడేశారు. అయితే అది పార్టీ కోసం తీసుకున్న నిర్ణయం కావడంతో సీనియర్లు ఎవరు అసంతృప్తి వ్యక్తం చేయలేదు. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసి వైసిపి కి ఛాన్స్ ఇస్తే.. తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బంది అవుతుందని సీనియర్లకు తెలుసు. అందుకే ఈ విషయంలో సీనియర్లు మౌనంగా ఉన్నారు. పదవులు దక్కలేదన్న అసంతృప్తి ఎక్కడా కనిపించకుండా చూసుకుంటున్నారు.

    * పక్కకు తప్పుకున్న సీనియర్లు
    ఎన్నికల్లో సీనియర్ నేతలుగా ఉన్న అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, గౌతు శ్యామసుందర శివాజీ, జెసి ప్రభాకర్ రెడ్డి, పతివాడ నారాయణ స్వామి నాయుడు లాంటి నేతలు పక్కకు తప్పుకున్నారు. అవకాశం ఉన్నచోట వారి వారసులను తెరపైకి తెచ్చారు. చంద్రబాబు పిలిచి మరీ వారికి టిక్కెట్లు ఇచ్చారు. వారంతా ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే నేతల వారసులకు సంబంధించి టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కు మాత్రమే మంత్రి పదవి దక్కింది. అయితే చాలామందికి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, కొత్తగా గెలిచినా మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. ఇదంతా ఓ నాలుగు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ ఉనికి కోసమేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.