Ind vs Nz 3rd Test: ముంబై మైదానాన్ని కూడా స్పిన్ వికెట్ కు అనుకూలంగా రూపొందించినట్టు వార్తలు వస్తున్నాయి. పూణే మైదానంలో స్పిన్ వికెట్ ను రూపొందించి టీమిండియా దారుణంగా విఫలమైంది. న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ సాంట్నర్ కు దాసోహం అయింది. అంతకుముందు బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ ఎదుట తలవంచింది. 46 పరుగులకే కుప్పకూలింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో తొలి టెస్ట్ ఓడిపోయింది. ఇక రెండో టెస్ట్ లోనూ అదే ఫలితం పునరావృతమైంది. బౌలర్లు పర్వాలేదు అనిపించినప్పటికీ.. బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా మినహ మిగతా వారంతా విఫలమయ్యారు. దీంతో భారత్ రెండవ టెస్టులోనూ ఓడిపోవలసి వచ్చింది. సాధారణంగా బ్యాటర్లు విఫలమైన చోట స్పిన్ దిగ్గజాలు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తమ బంతితో మ్యాజిక్ చేస్తారు. కానీ న్యూజిలాండ్ సిరీస్ లో ఇప్పటివరకు వారు తమ మ్యాజిక్ ప్రదర్శించలేదు. దీంతో భారత్ రెండు టెస్టులు ఓడిపోవాల్సి వచ్చింది.
మూడవ టెస్టులో అతడికి విశ్రాంతి
ముంబై వేదికగా ప్రారంభమైన మూడవ టెస్టులో భారత్ కీలకమైన మార్పు చేసింది. ఆకాశ్ దీప్ స్థానంలో హర్షిత్ రాణా కు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. తుది జట్టులో ఆకాశ్ దీప్ ఉన్నాడు. ఇక టీమ్ ఇండియా బౌలింగ్ కు మూల స్తంభమైన బుమ్రా కు ఈ మ్యాచ్ లో అవకాశం లభించలేదు. అతడు కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చింది. అతడి స్థానంలో సిరాజ్ కు అవకాశం కల్పించింది. న్యూజిలాండ్ సిరీస్లో బుమ్రా ఇంతవరకు తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. బెంగళూరు మైదానం పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. అతడు పెద్దగా సత్తా చాటలేకపోయాడు. దీంతో జట్టు ఓడిపోవాల్సి వచ్చింది. పూణే మైదానంలోనూ అతడు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. దీనికి తోడు అతడికి జ్వరం రావడంతో మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతని స్థానంలో సిరాజ్ ను తుది జట్టులో తీసుకుంది..కాగా, టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టు 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకరమైన కాన్వే(4) ఆకాష్ దీప్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. కెప్టెన్ లాతం (19), యంగ్ (3) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఐతే ముంబై మైదానాన్ని కూడా స్పిన్ వికెట్ గా రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే గత రెండు మ్యాచ్లలో తేలిపోయిన రవీంద్ర జడేజా, అశ్విన్.. ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.