Chandrababu
Chandrababu : గత ప్రభుత్వ నిర్ణయాలను పునసమీక్షిస్తోంది కూటమి ప్రభుత్వం( Alliance government). ప్రజా వ్యతిరేక వైఖరి కనిపిస్తే వెంటనే రద్దు చేస్తోంది. తాజాగా తిరుపతి వేదికగా అదే నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం చేసిన కేటాయింపులను తిరుమల వేదికగా రద్దు చేశారు. రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చంద్రబాబు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్సుతో కలిసి సాధారణ భక్తుల మాదిరిగా క్యూ లైన్ లోనే శ్రీవారి దర్శనానికి వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం అన్నదాన సేవలో పాల్గొన్నారు. స్వయంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు భక్తులకు వడ్డించారు.
Also Read : తిరుమలలో చంద్రబాబు కుటుంబం.. భక్తుల ఒకరోజు అన్నదానానికి విరాళం!
* వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో
అయితే తిరుమలలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో స్టార్ హోటల్స్ కట్టేందుకు భూ కేటాయింపులు చేశారు. దాదాపు ఓ 20 ఎకరాల వరకు కేటాయించారు. దీనిపై హిందూ ధార్మిక సంస్థలతో పాటు స్వామీజీలు, మఠాధిపతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో టీటీడీ సైతం అక్కడ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు స్పష్టం చేసింది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.
* కేటాయింపులు రద్దు
అయితే ఈరోజు చంద్రబాబు( Chandrababu) ఈ హోటల్స్ నిర్మాణంపై మాట్లాడారు. తిరుమలలో ముంతాజ్, ఎమర్, దేవా లోక్ హోటల్స్ నిర్మాణానికి చేసిన భూ కేటాయింపులను రద్దు చేశారు. తన జీవితంలో వేంకటేశ్వర స్వామి పవిత్రతను తలచుకుని ముందుకు వస్తానని చెప్పారు. ఏటా అన్నదానానికి విరాళం అందిస్తున్నామని.. ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం ట్రస్టుకు ఇప్పటివరకు రూ.2200 కోట్ల విరాళాలు అందినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని చెప్పుకొచ్చారు.
* రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్యం..
మరోవైపు రాయలసీమ( Rayalaseema ) ప్రజలకు హామీ ఇచ్చారు చంద్రబాబు. తిరుపతిలోని అన్ని ఆసుపత్రుల ద్వారా రాయలసీమలో ఉండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఉన్న వైద్యులు తిరుపతిలోని ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించి స్వామి వారిని దర్శించుకోవాలన్నారు చంద్రబాబు . అప్పట్లో తనపై అలిపిరిలో దాడి జరిగిందని.. శ్రీవారి ఆశీస్సులతో బయటపడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకే తిరుమల పవిత్రతను చాటి చెప్పేందుకే.. ఎటువంటి నిర్మాణాలు జరపకూడదని నిర్ణయం తీసుకున్నామని.. అందులో భాగంగానే హోటల్లో నిర్మాణానికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు చంద్రబాబు.
Also Read : ఆ నలుగురికి క్యాబినెట్ హోదా.. చంద్రబాబు సంచలన నిర్ణయం!