Chandrababu And Revanth Reddy: చంద్రబాబు, రేవంత్ కీలక భేటీ.. ఏం జరగనుంది?

గత కొద్దిరోజులుగా సీఎంల మధ్య సమావేశం జరగలేదు. గతంలో తెలంగాణ సీఎం గా కెసిఆర్ ఉండేవారు. ఏపీ సీఎం గా వ్యవహరించిన జగన్ కు అతనితో మంచి సంబంధాలు ఉండేవి.

Written By: Dharma, Updated On : July 2, 2024 12:00 pm

Chandrababu And Revanth Reddy

Follow us on

Chandrababu And Revanth Reddy: ఏపీ సీఎం చంద్రబాబు దూకుడుగా ఉన్నారు. పాలనాపరమైన అంశాల్లో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈనెల 4న ఢిల్లీ వెళ్ళనున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశం కానున్నారు. ఏపీకి సంబంధించి విభజన హామీలపై చర్చించనున్నారు. వెనువెంటనే తెలంగాణ సీఎం రేవంత్ సమావేశానికి ప్రతిపాదించారు. రేవంత్ రెడ్డి సైతం అంగీకరించడంతో ఈనెల 6న హైదరాబాద్ వేదికగా తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది.

గత కొద్దిరోజులుగా సీఎంల మధ్య సమావేశం జరగలేదు. గతంలో తెలంగాణ సీఎం గా కెసిఆర్ ఉండేవారు. ఏపీ సీఎం గా వ్యవహరించిన జగన్ కు అతనితో మంచి సంబంధాలు ఉండేవి.అయితే వారిద్దరూ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పని చేయలేదన్న కామెంట్స్ ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. వారి మధ్య సహృద్భావ వాతావరణం ఉంది. అందుకే చంద్రబాబు ప్రతిపాదించిన వెంటనే రేవంత్ అంగీకరించారు. ఈనెల 6న హైదరాబాదులోని ప్రజాభవన్లో ఇద్దరి మధ్య భేటీ జరగనుంది. రాష్ట్ర విభజనకు పదేళ్లు అవుతున్న నేపథ్యంలో విభజన హామీలపై ముఖాముఖి గా చర్చించుకుందాం అని చంద్రబాబు ప్రతిపాదనకు రేవంత్ అంగీకరించడంతో సమావేశానికి మార్గం సుగమం అయ్యింది.

సీఎంలతో పాటు ఇద్దరు సీనియర్ మంత్రులు, ఉభయ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు. విభజన చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలు, పెండింగ్ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా కొలిక్కి రాలేదు. దీంతో ఉభయ రాష్ట్రాల సీఎంల సమావేశానికి ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది. ఈ సమావేశానికి ముందు చంద్రబాబు రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఏపీకి సంబంధించి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు చర్చించనున్నారు. అటు ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

రెండు రాష్ట్రాల సీఎంల సమావేశానికి ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బలమైన చర్చ నడుస్తోంది. రేవంత్ గతంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అధ్యక్షుడు అయ్యారు. అనూహ్యంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తోటి తెలుగు రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం అందినా రేవంత్ హాజరు కాలేదు. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉండడమే అందుకు కారణం. అయితే తాజాగా రాష్ట్రాల మధ్య సమస్యలపై ముఖ్యమంత్రులు సమావేశం అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.