Union Budget 2024: కేంద్ర బడ్జెట్ కు రంగం సిద్ధం.. ఈసారి పలు కీలక ప్రతిపాదనలు

వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జూలై 22 నుంచి నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఆగస్టు 9వ తేదీ వరకు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

Written By: Raj Shekar, Updated On : July 2, 2024 11:56 am

Union Budget 2024

Follow us on

Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూలై 23 లేదా 24న పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈమేరకు కసరత్తు చేస్తున్నారు. అయితే అధికారికంగా తేదీలు ప్రకటించలేదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు జూలై 4న ముగుస్తాయి. ఈ సమావేశాల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక జరిగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం తెలుపనున్నారు. తర్వాత సమావేశాలు ముగుస్తాయి.

జూలై 22 నుంచి వర్షాకాల సమావేశాలు..
వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జూలై 22 నుంచి నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఆగస్టు 9వ తేదీ వరకు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది. జూలై 23 లేదా 24 తేదీల్లో బడ్జెట్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడతారని తెలుస్తోంది.

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక సిఫారసులు..
కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో జూన్‌ 22న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో వస్తు సేవలకు జీఎస్టీ వర్తింపును క్రమబద్ధీకరించడానికి ప్రతిపాదనలపై చర్చించారు. జీఎస్టీ పన్ను రేట్లు, సేవా మినహాయింపులను మెరుగుపరచడానికి అనేక సిఫార్సులు కౌన్సిల్‌ సూచించింది. రాష్ట్రాల వాటాను ఎప్పటికప్పుడు అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశాయి. నిర్మలా సీతారామన్‌ కూడా ఇందుకు సానుకూలంగా స్పందినట్లు తెలుస్తోంది.

భిన్నంగా బడ్జెట్‌ కేటాయింపులు..
ఇదిలా ఉంటే ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు గతంలోకన్నా భిన్నంగా ఉండే అవకాశం ఉందని జెఫరీస్‌ ఇప్పటికే అంచనా వేస్తోంది. ఆర్‌బీఐ రూ.2.11 లక్షల డివిడెండ్‌ చెల్లిస్తుండటంతో కేంద్రానికి ఆర్థిక లభ్యత పెరుగుతుందని తెలిపింది. దీంతో ఆర్థిక వృద్ధి లక్ష్యాలనూ కొనసాగిస్తూనే సామాజిక వ్యయం కూడా పెరిగేలా బడ్జెట్‌ కేటాయింపులు ఉండవచ్చని జెఫరీస్‌ నివేదిక తెలిపింది.