CM Chandrababu: తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతల తీరుపై చంద్రబాబు( CM Chandrababu) ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. పూర్తిస్థాయి పాలనపై దృష్టి పెట్టిన చంద్రబాబుకు కొంతమంది ఎమ్మెల్యేలు చికాకు పెడుతున్నారు. తమకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతూ వివాదాలకు కారణం అవుతున్నారు. ప్రతి జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అలానే ఉన్నారు. వారిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో సీఎం చంద్రబాబు అటువంటి వారికి పిలిచి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. మారకపోతే మార్చేస్తానని హెచ్చరిక కూడా జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరిస్తుండడం పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది బిజెపి ఎమ్మెల్యేల వైఖరి కూడా బాగాలేదని.. అటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని బిజెపి నాయకత్వానికి చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలను నియంత్రిస్తున్నారు.
* ఎమ్మెల్యేల పరస్పర ఫిర్యాదులు..
ప్రస్తుతం శాసనసభ సమావేశాలు( assembly sessions ) జరుగుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల పనితీరు బయటపడుతోంది. మొన్నటికి మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బోండా ఉమ. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖపైనే ఆరోపణలు చేశారు. అయితే దాని వెనుక చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఏమైనా ఉంటే కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెప్పవచ్చు కదా? ఇలా శాసనసభలో ప్రస్తావించడం ఏంటి అనే చర్చ కూటమిలో నడుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బిజెపి ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు.. టిడిపి ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలోకి వచ్చి తనపైనే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కూడా చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
* బిజెపిలో రచ్చ రచ్చ..
మరోవైపు బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు రచ్చకు దారితీస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో( Kadapa district) బిజెపి ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీపై బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు దాడి చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎంపీ పనులు చేయడం ఏమిటనేది ఎమ్మెల్యే వర్గం ఆరోపణ. దీనిని ఎంత మాత్రం సహించమని హెచ్చరిస్తూ వారు దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు ఇదే ఆదినారాయణ రెడ్డి అనంతపురం తాడిపత్రికి చెందిన జెసి ప్రభాకర్ రెడ్డితో వివాదం పెట్టుకున్నారు. సీఎమ్ఓ వరకు ఆ పంచాయతీ నడిచింది. ఇప్పుడు మరోసారి సొంత పార్టీలోనే చిచ్చు రేపేలా వీరిద్దరి వ్యవహార శైలి ఉంది.
* డిప్యూటీ సీఎం కు ఫిర్యాదులు..
అయితే జనసేన ఎమ్మెల్యేల విషయంలో పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. క్రమశిక్షణ కట్టు దాటితే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా వెళ్లాయి. ఏకంగా కొంతమంది నియోజకవర్గ ఇన్చార్జిలపైనే వేటు వేశారు. ఎమ్మెల్యేలకు సైతం ఇదే వర్తిస్తుందని హెచ్చరించారు. అయితే తాజాగా శ్రీకాళహస్తి లో ఓ దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకం విషయంలో జనసేన నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. నేరుగా పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. అయితే మూడు పార్టీల్లోనూ ఈ సరికొత్త వివాదాలు చికాకు పెడుతున్నాయి. వాటికి ఆదిలోనే పరిష్కారం మార్గం చూపకపోతే మాత్రం ఇబ్బందికరమే. మరి దీనిపై మూడు పార్టీలు ఎలా ముందుకెళ్తాయో చూడాలి.