Caste names on Vehicles: మనదేశంలో కొంతమందికి కుల పిచ్చి ఎక్కువగా ఉంటుంది. మెజారిటీ వర్గాలకు ఈ జాడ్యం అనేది ఎక్కువగా ఉండడంవల్ల సమాజంలో దారుణాలు జరుగుతున్నాయి. ఏదైనా విషయం ప్రస్తావన వచ్చినప్పుడు.. కులం పేరు అనేది అనివార్యంగా చర్చకు వస్తూ ఉంటుంది. అది కాస్త రెండు వర్గాల మధ్య దాడులకు కారణమవుతుంది. ఇక ఆధిపత్య కులాలు తమ బలాన్ని చూపించుకోవడానికి అనేక రకాల దారుణాలకు పాల్పడుతుంటాయి. ఈ తరహా దారుణాలు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కుల పిచ్చి అనేది అధికంగా ఉంటుంది. తెలంగాణలో గతంలో ఇటువంటి జాడ్యం లేకపోయినప్పటికీ.. ఇటీవల కాలంలో అది కనిపిస్తూ ఉన్నది.
రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం కులాల మధ్య కుంపట్లు రగిలిస్తూ ఉంటారు. మతాల మధ్య గొడవలు పెంచుతూ ఉంటారు. ఆ మంటల్లో వారు చాలికాచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కులాలవారీగా రాజకీయ నాయకులు సమావేశాలు నిర్వహిస్తుంటారు. తాయిలాలు ప్రకటిస్తూ ఉంటారు. అవసరమైతే ప్రభుత్వపరంగా ఎంత సహాయమైనా చేస్తామని హామీ ఇస్తూ ఉంటారు. కుల పిచ్చిలో ఉన్న నాయకులకు అవన్నీ కూడా అమృత వాక్యాలు మాదిరిగా కనిపిస్తుంటాయి. కులాల పిచ్చితో రగిలిపోయే మరికొందరి వ్యవహార శైలి విచిత్రంగా ఉంటుంది. తమ కులాన్ని ప్రతిబింబిస్తూ తమ ఉపయోగించే వాహనాల మీద పేర్లు రాసుకుంటారు. తమ కులమే గొప్పదని.. తమ కులమే ఉన్నతమైనదని చెప్పుకుంటారు. దానికి సింబాలిక్ గా సినీ నటుల ఫోటోలు కూడా వేసుకుంటారు. ఇక ఇటీవల కాలంలో ఈ జాడ్యం పెరిగిపోయింది. మేం ఫలానా కులమని.. ఫలానా నాయకుడి తాలూకా అని చెప్పుకోవడం ఎక్కువైపోయింది.
ఇక పై ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కుదరదు. కాకపోతే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ న్యాయస్థానం మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. “వాహనాల మీద కులం పేర్లు.. కులాలను కీర్తిస్తూ నినాదాలు.. సూక్తులు ఉంటే జరిమానా విధిస్తాం. ఇటువంటి పద్ధతి సమాజానికి మంచిది కాదు. ఇటువంటి విధానం వల్ల సమాజంలో తేడాలు వస్తాయి. ప్రజల మధ్య విభేదాలు పెరుగుతాయి. అటువంటి వాటిని చూస్తూ ఊరుకోం. ఇది మాత్రమే కాదు క్రిమినల్ ట్రాకింగ్ సిస్టంలో నిందితుల కులానికి బదులుగా తండ్రి పేరు పెట్టాలి. పోలీస్ స్టేషన్లో నిందితుల పేర్లు చెప్పేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కుల ప్రస్తావన తీసుకురావద్దని” అలహాబాద్ కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇటువంటి తీర్పు తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు.