https://oktelugu.com/

Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ చదువు కోలేదు.. నెత్తి మీద రూపాయి పెడితే ఎవడు కొనడు.. తిట్టావా? పొగిడావా ‘బాబూ’

వెనుకటి రోజుల్లో రాజకీయాలు హుందాగా ఉండేవి. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు విధానపరంగానే విమర్శలు చేసుకునేవారు. అరుదైన సందర్భంగా మాత్రమే ఆ విమర్శలు కాస్త కట్టు తప్పేవి. ఆ తర్వాత ఎవరో ఒకరు క్షమాపణ చెప్పేవారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 23, 2024 9:51 pm
    Chandrababu Naidu

    Chandrababu Naidu

    Follow us on

    Chandrababu Naidu: ఇప్పటికాలంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. విమర్శలు విధానపరమైన స్థాయిని దాటి వ్యక్తిగతంలోకి ప్రవేశించాయి. కుటుంబ సభ్యులను కూడా కించపరిచే స్థాయికి దిగజారాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా వినియోగం కూడా పెరిగిపోవడంతో.. వ్యక్తిగత దూషణ అనేది తారస్థాయికి చేరింది. అది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే పతనమవుతున్న విలువలను నిజం చేసి చూపిస్తోంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల సామాజిక మాధ్యమాల గ్రూపులలో వాళ్లకు నచ్చినట్టుగా వీడియోలు ఎడిట్ చేసి పోస్ట్ చేసుకుంటున్నారు. దీనివల్ల సమాజంలో తీవ్రమైన అశాంతి నెలకొంటున్నది. వ్యక్తుల మధ్య తీవ్రమైన ఆగాధం ఏర్పడుతోంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన ఘటనలు జరిగేందుకు ఆస్కారం కలిగిస్తోంది..

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినప్పటికీ సోషల్ మీడియాలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసిపి పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. వ్యక్తిగత విషయాలను కూడా బయటపెడుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలు ఏవగింపును ప్రదర్శించే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎన్నికల మూసినప్పటికీ రాజకీయ పార్టీలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా సోషల్ మీడియాలో నిత్యం యుద్ధ తరహా వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఇటీవల ఓ ప్రాంతంలో పర్యటించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ విషయాన్ని ఒక విషయంలో ప్రస్తావించారు. అయితే దీనిని తెలివిగా కొంతమంది వైసిపి అనుకూల నెటిజన్లు తమకు అనువుగా మలుచుకున్నారు. జగన్ అన్న మాటలను పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రస్తావించినట్టు వీడియో ఎడిట్ చేశారు. ఇంకేముంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. టిడిపి, జనసేన మధ్య గ్యాప్ ఏర్పడిందని.. అందుకు నిదర్శనమే చంద్రబాబు నాయుడు మాటలని వైసీపీ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. దీంతో కూటమి నాయకులు స్పందించాల్సి వచ్చింది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

    సాధారణంగా సోషల్ మీడియా అనేది మంచికి ఉపయోగించాలి. లేదా కాస్త కాలక్షేపానికి వినియోగించాలి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయ పార్టీలు వ్యక్తిగత దూషణకు.. తమ రాజకీయ ఎదుగుదల కోసం వాడుతున్నాయి. ఇందులో విమర్శలను ఇష్టానుసారంగా చేస్తున్నాయి. వ్యక్తిగత జీవిత విషయాలను కూడా బజార్లో పెడుతున్నాయి. దీంతో సామాన్య జనం రాజకీయ పార్టీల వ్యవహార శైలి చూసి తలలు పట్టుకుంటున్నారు. ఇందులో ఒక పార్టీది తప్పు, మరో పార్టీది ఒప్పు అని చెప్పడానికి లేదు. అందరూ ఆ తానులో ముక్కలే. కాకపోతే అంతిమంగా ఇబ్బంది పడేది మాత్రం ప్రజలు. కానీ ఆ విషయమే వారికి అర్థం కావడం లేదు. వారు అర్థం చేసుకునే లోపలే రాజకీయ నాయకులు చేయాల్సిన నష్టం చేసి వెళ్తున్నారు.