Chandrababu : పోలవరంను ప్రాధాన్యత ప్రాజెక్టుగా భావిస్తున్నారు చంద్రబాబు. ఏపీ ప్రజల జీవనాడిగా భావిస్తున్న ప్రాజెక్టు నిర్మాణంపై గత వైసిపి ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించి శ్వేత పత్రం కూడా విడుదల చేశారు. ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తన ప్రాధాన్యతను తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని అధికారులతో పాటు ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.టిడిపి హయాంలో శరవేగంగా జరిగిన పనులు.. వైసీపీ హయాంలో మందగించడం పై ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. దానిని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. శ్వేత పత్రం విడుదల చేశారు.
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు నాడు చంద్రబాబు. భూ సేకరణతో పాటునిర్వాసితుల సమస్యలను అధిగమించి ఎప్పటికప్పుడు ముందడుగు వేశారు. చాలా రకాల నిర్మాణాలను పూర్తి చేశారు. అప్పట్లో ఒక్కరోజులోనే స్పిల్ ఛానల్లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన విషయాన్ని శ్వేత పత్రంలో గుర్తు చేశారు చంద్రబాబు. నాడు కేంద్ర మంత్రులు పోలవరాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుల్లో ప్రతి నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశామని.. టిడిపి హయాంలోనే 72 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతూ.. సవివరంగా వాటిని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు చంద్రబాబు.
ఈ ఎన్నికల్లో వైసీపీ దెబ్బ తినడానికి పోలవరం ప్రాజెక్టు కూడా ఒక కారణం. వైసిపి ఏలుబడిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆశించిన స్థాయిలో ముందుకెళ్లలేదు. 72 శాతం పనులతో ప్రాజెక్టు నిర్మాణాన్ని టిడిపి ప్రభుత్వం అప్పగించినా.. మిగతా పనులు పూర్తి చేయడంలో జగన్ సర్కార్ విఫలం అయింది. ఈ విషయంపై విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఏపీ ప్రజల జీవనాడిగా భావిస్తున్న పోలవరం విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరుపై ప్రజల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత వ్యక్తం అయింది. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై చూపింది. అందుకే జగన్ సర్కార్ చర్యలను ఇప్పుడు చంద్రబాబు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్నిఒక సంస్థకు అప్పగించారు.వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు మార్చి వేరే సంస్థకు అప్పగించారు. కానీ అనుకున్న స్థాయిలో పనులు పూర్తి చేయలేకపోయారు. రివర్స్ టెండర్ల ద్వారా 738 కోట్లు ఆదా చేసినట్లు వైసిపి చెప్పుకొచ్చింది. కానీ అంతకుమించి నష్టం డయా ఫ్రం వాల్ కొట్టుకుపోవడం ద్వారా జరిగింది. 2019లో జగన్ ప్రమాణస్వీకారం చేసిన నాడే పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిన విషయాన్ని సైతం చంద్రబాబు తాజాగా శ్వేత పత్రంలో పొందుపరిచారు. దీని ద్వారా జగన్ ను మరింత పలుచన చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. ఆయన వ్యూహానికి తగ్గట్టే ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళ్తోంది. దీనిని వైసీపీ ఎలా తిప్పి కొడుతుందో చూడాలి.