New Electric Car: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడంతో పాటు కాలుష్యం కారణంగా ఇంధన కార్లకు స్వస్తి పలుకుతున్నారు. ఇండియన్ ఆటోమోబైల్ డీలర్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ఇండియాలో 90,996 ఎలక్ట్రిక్ కార్లు విక్రయం జరుపుకున్నాయి. ఒక్క ఏడాదిలోనే 91.37 శాతం వృద్ధి నమోదు కావడంతో ఈవీల వినియోగం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కొత్త కార్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. లేటేస్ట్ గా హ్యుందాయ్ కంపెనీ నుంచి ‘ఇన్ స్టర్’ రాబోతుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశంలో మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు ‘కోన’ను పరిచయం చేసింది హ్యుందాయ్ కంపెనీనే.ఆ తరువాత మరిన్ని మోడల్స్ మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. లేటేస్ట్ గా ఈ కంపెనీ నుంచి ఇన్ స్టర్ రాబోతుంది. ఈ మోడల్ టాటా కంపెనీకి చెందిన ‘పంచ్ ఈవీ’ కి గట్టి పోటీ ఇవ్వనుంది. టాటా పంచ్ ఈవీని రూ.10.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీని కంటే హ్యుందాయ్ ఇన్ స్టర్ లో లేటేస్ట్ ఫీచర్స్ ను అమర్చి ధర పెంచారు. ఇన్ స్టర్ మార్కెట్లోకి వస్తే రూ.12 లక్షలతో విక్రయించనున్నారు.
హ్యుందాయ్ ఇన్ స్టర్ మోడల్ లో బిగ్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. ఇందులో 42 kWh బేస్ మోడల్ బ్యాటరీ, 49kWh టాప్ మోడల్ బ్యాటరీ ఉండనుంది. దీనిని ఒక్కసారిగా ఛార్జింగ్ చేస్తే 355 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు పరిమాణం అచ్చం టాటా పంచ్ మోడల్ ను పోలి ఉంటుంది. సీటింగ్ విషయంలో ఎంజీ కామెట్ తో పోటీ పడుతుంది. అయితే ఎలక్ట్రిక్ కార్ల విషయంలో టాటా పంచ్ కు పోటీగా సరసమైన ధరకే అందించనున్నట్లు తెలుస్తోంది.
భారత్ లో త్వరలో దీనిని విడుదల చేయనున్నట్లు ఇంటర్నేషనల్ మొబిలిటీ షో లో కంపెనీ తెలిపింది. ఇక్కడి 5 సెంటర్ లేఅవుట్ లో ఇన్ స్టర్ ను పరిచయం చేయనున్నారు. ఎలక్ట్రిక్ కార్ల హవా పెరుగుతున్న నేపథ్యంలో హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారును తీసుకు రావడం వినియోగదారుల్లో ఉత్సాహం నెలకొంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.