Chandrababu : చంద్రబాబు మారారు. తన పాత పంథాను విడిచిపెట్టారు. వైసీపీ రూపంలో బలమైన ప్రత్యర్థి ఉండడంతో చాలారకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించడానికి ప్రయత్నిస్తున్నారు. బహు నాయకత్వం ఉన్నచోట వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. వారిని బుజ్జగిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా సొంత జిల్లా చిత్తూరుపై ఫోకస్ పెంచారు. ఏకంగా మూడు నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను నియమించారు. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకుగాను గెలిచింది ఒకటే. అది కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో సరిపెట్టుకున్నారు. ఈసారి మాత్రం మెజార్టీ నియోజకవర్గాలపై గురిపెట్టారు.
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. నిజమే చంద్రబాబు ఇప్పుడు అదే పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో తన ప్రతాపం చూపాలని భావిస్తున్నారు. ముందే టిక్కెట్లు కన్ఫర్మ్ చేసి నేతలకు కదనరంగంలోకి దూకాలని ఆదేశిస్తున్నారు. నాయకులను సమన్వయం చేస్తున్నారు. ఒకేసారి మూడు నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను ప్రకటించారు. ఈ మూడు ఎస్సీ నియోజకవర్గాలే కావడం విశేషం. రెండు నియోజకవర్గాలకు బలమైన వైద్యులను రంగంలోకి దించారు. సత్యవేడు నియోజకవర్గానికి డాక్టర్ హెలెన్, గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి డాక్టర్ థామస్ లను ఇన్ చార్జిలుగా నియమించారు. పూతలపట్టు నియోజకవర్గ బాధ్యతలను మురళీ మోహన్ కు అప్పగిస్తూ నిర్ణయం తసుకున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. నాయుడు రాకను శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ చార్జి బోజ్జల సుదీర్ వ్యతిరేకించారు. చంద్రబాబు పిలిచి మాట్లాడడంతో మెత్తబడ్డారు. గతంలో నియోజకవర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడిచేది. అది పార్టీకి తీరని నష్టం చేసేది. అటువంటి నియోజకవర్గాలపై దృష్టిపెడుతున్న చంద్రబాబు నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. సర్దుబాటు చేస్తున్నారు. దీంతో నేతలు సైతం ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు గతానికి భిన్నంగా వ్యవహరిస్తుండడం విశేషం.
వచ్చే నెలలో తిరిగి జిల్లాల పర్యటనను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇప్పటికే 13 లోక్ సభ స్థానాల పరిధిలో 29 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించారు. మిగతా 12 లోక్ సభ స్థానాలను వీలైనంత త్వరగా పర్యటించాలని ప్రయత్నిస్తున్నారు. జూలై నుంచి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ బలోపేతంతో పాటు అటు పొత్తుల వ్యూహాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు ఈసారి ముందే మేల్కొన్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను అన్నివిధాలా సిద్ధం చేసే పనిలో పడ్డారు.