Srikakulam TDP: శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు కొత్త నేతలకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్ ల పేర్లను ఖరారు చేశారు. ఈ ఇద్దరు నేతలు కొత్త వారే. రెండు చోట్ల ఇన్చార్జిలను తప్పించి.. ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న ఇద్దరినీ అభ్యర్థులుగా ప్రకటించారు. పార్టీ సర్వేల్లో ఈ ఇద్దరు నేతలు ముందంజలో ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు ప్రోత్సాహంతోనే ఈ ఇద్దరికీ టిక్కెట్లు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది.
శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఉన్నారు. ఆమె మాజీ మంత్రి, సీనియర్ నేత గుండ అప్పల సూర్యనారాయణ భార్య. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా ఆమె తెరపైకి వచ్చారు. గుండ అప్పల సూర్యనారాయణకు టికెట్ నిరాకరించడంతో భార్య లక్ష్మీదేవి అప్పట్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో సైతం ఆమె పోటీ చేసి ధర్మాన ప్రసాదరావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.ఈ ఎన్నికల్లో సైతం టికెట్ను ఆశించారు. తొలుత ఈ స్థానం బిజెపికి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె అభిమానులు, టిడిపి శ్రేణులు ఆందోళన చెందాయి. దీంతో బిజెపికి ఈ సీటు ఇవ్వడం లేదని హై కమాండ్ ప్రకటించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో టిడిపి మూడో జాబితాను ప్రకటించింది. కానీ గుండ లక్ష్మీదేవిని తప్పించి.. గొం డు శంకర్ కు టిడిపి నాయకత్వం అవకాశం ఇచ్చింది. శంకర్ గత కొన్నేళ్లుగా టిడిపిలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. టికెట్ ఆశిస్తూ వచ్చారు. అనూహ్యంగా ఆయనకు టికెట్ వరించడం విశేషం.
పాతపట్నం టిడిపి ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఉన్నారు. 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటరమణ.. వైసిపి గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొద్ది రోజులకే టిడిపిలోకి వెళ్లారు. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో సైతం తనకే టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ హై కమాండ్ మాత్రం గోవిందరావుకు అవకాశం ఇచ్చింది. గత కొద్ది సంవత్సరాలుగా గోవిందరావు పార్టీలో యాక్టివ్ గా పని చేస్తున్నారు.సర్వేలు అనుకూలంగా ఉండడంతో హై కమాండ్ ఈయనకు టికెట్ కట్టబెట్టినట్లు సమాచారం.
అయితే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, పాతపట్నం అసెంబ్లీ స్థానాల విషయంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు మాట చెల్లుబాటు అయినట్లు సమాచారం.పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణమూర్తి తో విభేదాలు ఉన్నాయి.అందుకే అక్కడ ప్రత్యామ్నాయంగా మామిడి గోవిందరావును ఆయన ప్రోత్సహించారన్న కామెంట్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. అటు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం మాజీ ఎమ్మెల్యే అప్పల సూర్యనారాయణ.. అచ్చెనాయుడుని విభేదిస్తుంటారు. అందుకే గుండ లక్ష్మీదేవి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన ఇద్దరు యువ నాయకులకు చంద్రబాబు టిక్కెట్లు ఇవ్వడం విశేషం. అయితే అక్కడ టికెట్ ఆశించిన ఇన్చార్జిలు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి.