Chandrababu: చంద్రబాబు ప్రయోగం.. విఫలమా? సఫలమా?

45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర చంద్రబాబు సొంతం. ఉమ్మడి ఏపీకి ఎక్కువ కాలం పాలించింది ఆయనే. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబే. ఎక్కువకాలం ప్రతిపక్ష నేతగా కూడా ఆయనే వ్యవహరించారు.

Written By: Dharma, Updated On : February 18, 2024 10:41 am

Chandrababu

Follow us on

Chandrababu: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. అంతటా ఎలక్షన్ ఫీవర్ నెలకొంది. వైసీపీ అధినేత జగన్ దూకుడుగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతూ.. జాబితాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు ఏడు జాబితాలను ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. జనసేన తో పొత్తు కుదుర్చుకున్నారు. మరోవైపు బిజెపి కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా 40 స్థానాలు వదులుకోవాల్సి ఉంటుందని ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే మిగతా 135 నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఒక కొలిక్కి రాలేకపోతున్నారు.

45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర చంద్రబాబు సొంతం. ఉమ్మడి ఏపీకి ఎక్కువ కాలం పాలించింది ఆయనే. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబే. ఎక్కువకాలం ప్రతిపక్ష నేతగా కూడా ఆయనే వ్యవహరించారు. అటువంటి వ్యక్తికి ప్రతి నియోజకవర్గంపై పట్టు ఉంటుంది. సమగ్ర అవగాహన ఉంటుంది. ఏ నేతకు టికెట్ ఇస్తే గెలవగలరో కూడా చంద్రబాబు చెప్పేయగలరు. కానీ అటువంటి చంద్రబాబు చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నో సర్వేలు చేపట్టి అభ్యర్థులను వడబోస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీలోని ఆశావహులకు మింగుడు పడని విషయం. పార్టీ కోసం అహోరాత్రులు పాటుపడుతుంటే.. సర్వేల పేరిట తమను అవమాన పరుస్తున్నారని ఎక్కువ మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబు నాలుగు సార్లు అభ్యర్థుల విషయంలో సర్వేలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఐటీడీపీ, జన్మభూమి కమిటీలు, పార్లమెంటరీ ఇన్చార్జిల కమిటీలు, సీనియర్ మాజీ మంత్రుల కమిటీల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. నేరుగా అభ్యర్థులను పిలిచి చర్చించారు కూడా. దీంతో నేతలంతా తమకు టిక్కెట్లు దక్కినట్లేనని సంతృప్తి పడ్డారు. కానీ ఇప్పుడు మరోసారి సర్వే చేపడుతుండడంతో వారిలో ఆందోళన ప్రారంభమైంది. గత రెండు రోజుల నుంచి సర్వే కొనసాగుతోంది. మీ నియోజకవర్గంలో ఫలానా అభ్యర్థి అయితే ఎలా ఉంటుందని? ఓటువేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వారి ఫీడ్ బ్యాక్ ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజల మూడ్ ఎలా ఉంటుందో తెలియదని.. చంద్రబాబు అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒకటి చెబుతారని.. అప్పుడు తమకు వ్యతిరేకంగా చెబితే.. అభ్యర్థి నుంచి తప్పిస్తారా? అని ఆశావాహులు ప్రశ్నిస్తున్నారు. ఇది విఫల ప్రయోగమని.. ఎన్నికల ముంగిట ఈ తరహా సర్వేలు పనిచేయవని టిడిపిలో సీనియర్లు చెబుతున్నారు. చంద్రబాబు తాజా సర్వే తో టిక్కెట్ల లెక్కలు మారుతాయని ఆందోళన చెందుతున్నారు.