Chandrababu And Pawan Kalyan: తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. తొలి జాబితా సైతం ప్రకటించారు. టిడిపి 94 స్థానాల్లో, జనసేన ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. వీలైనంత త్వరగా మిగిలిన నియోజకవర్గాలను ప్రకటించాలని భావిస్తున్నాయి. మరోవైపు ఈ కూటమిలోకి బిజెపి సైతం వస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీద ఉన్న టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణను ప్రారంభించాయి. అందులో భాగంగా ఉమ్మడిగా ఎన్నికల ప్రచారానికి చంద్రబాబుతో పాటు పవన్ సిద్ధమయ్యారు. తాడేపల్లిగూడెం, పత్తిపాడులో నేడు భారీ బహిరంగ సభలు జరగనున్నాయి. ఇరు పార్టీల అధినేతలు ఎన్నికల సమర శంఖాన్ని పూరించనున్నారు. ఈ సభలకు లక్షలాదిమంది జనం తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. తెలుగు జన విజయకేతనం జెండాగా ఈ సభకు నామకరణం చేశారు.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటికి ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. జనసేనతో పొత్తు కుదిరిన వేళ ఈ సూపర్ సిక్స్ పథకాలకు మరింత పదును పెట్టి.. జనసేన అంశాలను జత చేసి..ఉమ్మడి అజెండాను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధం పేరిట సీఎం జగన్ మూడు సభలను నిర్వహించారు. చంద్రబాబుతో పాటు పవన్ లను టార్గెట్ చేసుకున్నారు. ఈ సభలకు లక్షలాదిమంది జనాలను సమీకరించి సవాల్ చేశారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు, పవన్ లు ఈ సభా వేదికపై జగన్ విమర్శలకు దీటైన కౌంటర్లు ఇవ్వనున్నారు.
తెలుగు జన విజయకేతనం జెండా బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సభలు సక్సెస్ కాకుండా ప్రభుత్వం అడుగడుగునా అడ్డు తగులుతోందని ఆ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి.సభకు బస్సులను ఇవ్వకుండా ప్రభుత్వం నియంత్రిస్తోందని చెప్పుకొస్తున్నాయి. మరోవైపు ప్రైవేటు వాహనాల్లో భారీగా జనాలు సభా ప్రాంగణాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ చర్యలను నియంత్రించి మరీ సభకు హాజరుకావాలని ఉభయ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ముందుగా తాడేపల్లిగూడెంలో సభ ఉంటుంది. తరువాత పత్తిపాడు లో కొనసాగుతుంది. పొత్తు అధికారికంగా కుదిరి.. సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత చంద్రబాబు, పవన్ లు హాజరయ్యే తొలి సభలు ఇవే. దీంతో రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశాయి. సీట్ల సర్దుబాటు నేపథ్యంలో రెండు పార్టీల్లో అసంతృప్తులు వెలుగు చూశాయి. దీనిపై ఇరువురు అధినేతలు స్పష్టమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు, పవన్ లు హాజరయ్యే ఈ బహిరంగ సభలపై జాతీయస్థాయిలో కూడా ఫోకస్ ఉంది. బిజెపి కలిసి రానుండడంతో ఆ పార్టీ శ్రేణులు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి.