Free Electricity: ఫ్రీ కరెంట్‌.. ఇలా చేస్తే షాక్‌ తప్పదు!

కొత్తగా ప్రారంభించిన రెండు పథకాలకు రేషన్‌ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది. అభయహస్తంలో దరఖాస్తు చేసుకుని, తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే ఈ రెండు పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Written By: Raj Shekar, Updated On : February 28, 2024 1:12 pm
Follow us on

Free Electricity: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలకు మంగళవారం(ఫిబ్రవరి 27న) ప్రారంభించింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ను అందించాలని నిర్ణయించింది. ఈమేరకు చేవెళ్లలో సీఎం రేవంత్‌రెడ్డి రెండు పథకాలను ప్రారంభించారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రాయణం కల్పించింది. తాజాగా ఫ్రీకరెంటు, సబ్సిడీ సిలిండర్లకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది.

రేషన్‌కార్డు ఉన్నవారికే..
కొత్తగా ప్రారంభించిన రెండు పథకాలకు రేషన్‌ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది. అభయహస్తంలో దరఖాస్తు చేసుకుని, తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే ఈ రెండు పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. రేషన్‌కార్డు లేనివారికి ఇవి వర్తించవు. ఇక ఒక మీటర్‌ ఉన్న ఇళ్లకు మాత్రమే గృహ జ్యోతి వర్తిస్తుంది. అద్దెదారులు, అద్దె వసతి గృహాల్లో నివసిస్తున్నవారు ఈ పథకానికి అర్హులని ప్రకటించినా యజమాని మీటర్‌కు వర్తిస్తే అద్దెకు ఉన్నవారికి ఉచిత విద్యుత్‌ రాదు. ఇక గతంలో విద్యుత్‌ బిల్లులు బకాయి ఉన్నవారు అంటే రెండు నెలలుగా బిల్లు చెల్లించనివారు ఈ పథకానికి అనర్హులు. ఇక 2022–23 సంవత్సరంలో వార్షిక విద్యుత్‌ వినియోగం 2,181 మించి ఉన్నా సబ్సిడీ విద్యుత్‌ వర్తించదు.

ఇలా చేస్తే షాకే..
ఇక గృహజ్యోతి లబ్ధిదారుల కూడా కొన్ని మార్గదర్శకాలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. సబ్సిడీ విద్యుత్‌ను ఇంటి అవసరాలకు మాత్రమే వినియోగించాలి. ఇతర అవసరాలకు వినియోగించొద్దు. కమర్షియల్‌ అవసరాలకు సబ్సిడీ విద్యుత్‌ వాడితే విద్యుత్‌ చట్టం – 2003 ప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకుంటారు.