Chandrababu And Pawan Kalyan: ఏపీలో జగన్ అధికారానికి దూరం కావాలి. టిడిపి, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఈ లక్ష్యంతోనే చంద్రబాబు, పవన్ ముందుకు సాగుతున్నారు. అతి కష్టం మీద బిజెపిని తమతో కలుపుకున్నారు. అయితే ఆ రెండు పార్టీల లక్ష్యం జగన్ గద్దె దిగడం కాగా.. బిజెపి మాత్రం తమ పార్టీ బలపడడం, ఏపీలో విస్తరించడం అన్న కాన్సెప్ట్ తోనే కూటమి కట్టింది. అయితే ఇప్పుడు జనసేనతో పాటు బిజెపి… తెలుగుదేశం పార్టీని అనుసరించక తప్పదు. టిడిపి మేనిఫెస్టోని బలపరచక తప్పని పరిస్థితి. కూటమిలో అతిపెద్ద పార్టీ, ఆపై టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో.. ఆ పార్టీ మేనిఫెస్టోకు మాత్రమే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. దానినే ప్రజలు నమ్ముతారు కాబట్టి ఆ రెండు పార్టీలు అనుసరించక తప్పని పరిస్థితి.
కొద్ది నెలల కిందట పవన్ కళ్యాణ్ జనసేన మేనిఫెస్టో నమూనా విషయాన్ని ప్రకటించారు. జగన్ ను గద్దె దించేందుకు షణ్ముఖ వ్యూహంతో ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు. అయితే అక్కడికి కొద్ది రోజులు తర్వాత టిడిపి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. కానీ జనసేన షణ్ముఖ వ్యూహం అమలుకు నోచుకోలేదు. టిడిపి సూపర్ సిక్స్ పథకాలు మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఇంతలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల ముందుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటించారు. పవన్ సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కానీ నెలలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. టిడిపి సూపర్ సిక్స్ పథకాలతోనే ఇటు చంద్రబాబు, అటు పవన్ లు ప్రచారం చేస్తుండడం విశేషం.
కూటమిలోకి బిజెపి చేరింది. దీంతో మూడు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు కసరత్తు జరుగుతోంది. అయితే ఇందులో బీజేపీ పాత్ర నామమాత్రంగా ఉంటుంది. ఇప్పటికే జనసేన మేనిఫెస్టో అనేది ఎక్కడ కనిపించడం లేదు. షణ్ముఖ వ్యూహం సైతం తెరమరుగయింది. దాని ప్రస్తావనంటూ లేదు. జగన్ను అధికారం నుంచి దూరం చేయడమే పవన్ అజెండాగా మారిపోయింది. అటు చంద్రబాబు లక్ష్యం కూడా అదే. దానికి మించి ఎజెండా లేదని తేలిపోయింది. జాతీయ పార్టీగా ఉన్న బిజెపి సైతం ఏపీలో ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించే అవకాశం లేదు. ఆ పార్టీ సైతం టిడిపి మేనిఫెస్టోను అనుసరించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 17న విడుదల చేసి ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ లక్ష్యానికి తగ్గట్టే ఉంటుంది కానీ.. ఇందులో బిజెపి పాత్ర ఏమీ ఉండదు. అంతా ఆ ఇద్దరి నేతల లక్ష్యానికి అనుగుణంగానే కూటమి అడుగులు పడతాయి. అంతకుమించి బిజెపి మాత్రం ప్రభావం చూపే అవకాశమే ఉండదు.