TDP Janasena BJP Alliance: ఏపీలో పొత్తుల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. టిడిపి, జనసేన,బిజెపి కూటమి ఖాయమైన సంగతి తెలిసిందే. సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించేందుకు టిడిపి అంగీకరించింది. అయితే ఇప్పుడు ఎవరెవరు ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయాలో నిర్ణయించనున్నారు. ఇప్పటికే టిడిపి, జనసేన తొలి జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో.. ఆ సీట్లలో సైతం చేర్పులు, మార్పులు ఉండే అవకాశం ఉంది.
బిజెపికి ఆరు పార్లమెంట్ స్థానాలు, ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి టీడీపీ నుంచి బిజెపికి ప్రతిపాదనలు వెళ్లాయి. బిజెపి జాతీయ నాయకులు చర్చలు జరిపి ఫైనలైజ్ చేయనున్నారు. అందుకే ఢిల్లీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్, జయంత్ పాండా, శివ ప్రకాష్ తో కూడిన బృందం విజయవాడ చేరుకుంది. పవన్ తో పాటు పురందేశ్వరి తో ఈ బృందం భేటీ అయింది. నేటి చర్చల్లో చంద్రబాబు పాల్గొనుండడంతో సీట్ల సర్దుబాటు పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుంది. అక్కడ గెలిచే అభ్యర్థి ఎవరు అన్న అంశాలపై మూడు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
బిజెపి కోసం జనసేన తన ఒక ఎంపీ పార్లమెంట్ స్థానాన్ని వదులుకుంది. అనకాపల్లి స్థానాన్ని బిజెపికి విడిచిపెట్టగా.. ఆ స్థానం బదులు విశాఖ కావాలని బిజెపి కోరుతోంది. అందుకు చంద్రబాబు అంగీకరించడం లేదు. దీంతో బిజెపి అనకాపల్లి నుంచి పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. బిజెపికి ఆరు అసెంబ్లీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. కానీ బిజెపి అవసరాల దృష్ట్యా మరో నాలుగు స్థానాలను కోరుతోంది. అయితే అసెంబ్లీ స్థానాలను పెంచే అవకాశం కనిపించడం లేదు. అవసరమైతే మరో పార్లమెంట్ స్థానాన్ని కేటాయిస్తాం కానీ.. అసెంబ్లీ స్థానాలను వదులుకునే ప్రసక్తి లేదని టిడిపి తేల్చి చెప్పినట్లు సమాచారం. అటు విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని సైతం బిజెపి అడుగుతున్నట్లు తెలుస్తోంది. దానిని సైతం వదులుకునేందుకు టిడిపి సిద్ధంగా కనిపించడం లేదు.
మరోవైపు ఎంపీ అభ్యర్థులను బిజెపి దాదాపు ఖరారు చేసింది. రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేదా సీఎం రమేష్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. నర్సాపురంలో పోటీకి రఘురామ కృష్ణంరాజు సిద్ధంగా ఉన్నారు. రాజమండ్రి నుంచి పురందేశ్వరి రంగంలో దిగనున్నారు. ఏలూరు నుంచి సుజనా చౌదరి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయితే వీలైనంతవరకు ఈరోజు అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టతకు రానున్నారు. మూడు పార్టీలు సంయుక్తంగా ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. సాయంత్రానికి దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది.