https://oktelugu.com/

CM Chandrababu: ఢిల్లీ నుంచి అటే మహారాష్ట్ర.. ఆ నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం*

మూడోసారి కేంద్రంలో అతి కష్టం మీద అధికారంలోకి వచ్చింది బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బలం తగ్గుతోంది. ఈ తరుణంలో మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతుండడంతో చంద్రబాబు సాయాన్ని కోరారు బిజెపి అగ్ర నేతలు.

Written By: Dharma, Updated On : November 15, 2024 1:00 pm
CM Chandrababu(11)

CM Chandrababu(11)

Follow us on

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఏపీకి సంబంధించి కీలక ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారు. మరోవైపు ఏపీలో కేంద్ర ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అదే సమయంలో ఢిల్లీలో ఓ మీడియా ఏర్పాటుచేసిన సదస్సులో సైతం చంద్రబాబు పాల్గొనున్నారు. రోజంతా ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్న చంద్రబాబు శనివారం మహారాష్ట్ర వెళ్ళనున్నారు. అక్కడ ఎన్డీఏ కూటమి తరుపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ఈ తరుణంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయాలని చంద్రబాబును కేంద్ర పెద్దలు కోరినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో తెలుగు మూలాలు ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. అక్కడ తెలుగు వారు కూడా అధికం. గెలుపోటములు నిర్దేశించే స్థాయిలో వారు ఉన్నారు. ఈ తరుణంలోనే బిజెపి అగ్ర నేతలు చంద్రబాబును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే ఫలితముంటుందని అంచనాకు వచ్చారు. చంద్రబాబును కోరడంతో ఆయన సమ్మతించారు. ఈరోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో మహారాష్ట్ర వెళ్ళనున్నారు చంద్రబాబు.

* మహారాష్ట్రలో బిజెపికి క్లిష్టం
మహారాష్ట్రలో బిజెపి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అక్కడ తిరుగుబాటు శివసేన, ఎన్సీపీలతో కలిసి పోటీ చేస్తోంది. అక్కడ గెలవడం బీజేపీకి ముఖ్యం కూడా. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతోనే జాతీయ రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోకూడదని బిజెపి భావిస్తోంది. అందుకే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో చంద్రబాబు తో పాటు పవన్ తో ప్రచారం చేయించాలని చూస్తోంది. మొన్న పవన్ ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్ షా అదే కోరినట్లు సమాచారం. విపరీతమైన స్టార్ డం ఉన్న పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే తెలుగు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుంది. అందుకే తెలుగు నేతలు ఇద్దరిని కేంద్ర పెద్దలు సాయం కోరినట్లు తెలుస్తోంది.

* నమ్మదగిన స్నేహితుడిగా
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కేంద్ర పెద్దలకు నమ్మదగిన మిత్రపక్షంగా మారింది. ఎన్డీఏ పరంగా ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది. చంద్రబాబు సైతం రాజకీయపరంగా కంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం 15 వేల కోట్ల రూపాయల సాయం అందించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోంది. విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ కు సానుకూలంగా ఉంది. ఏపీలో రోడ్లు, రైల్వే ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీకి కేంద్రం ప్రాధాన్యమిస్తున్న క్రమంలో.. ఎన్డీఏ కు అన్ని విధాలా అండదండలుగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్డీఏలో యాక్టివ్ పార్ట్నర్ గా ఉన్న చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తారో చూడాలి.