England Vs West Indies T20: ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ 3-0 తేడాతో ట్రోఫీని దక్కించుకుంది. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే విజేతగా నిలిచింది. సెయింట్ లూసియా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిధ్య వెస్టిండీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్లు లెవీస్ (3), హాప్(4) పూర్తిగా నిరాశపరిచారు. పూరన్(7), చేజ్(7), హిట్ మేయర్(2) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ జట్టు ఒకానొక దశలో 5.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 37 పరుగులు మాత్రమే చేసింది. దీంతో వెస్టిండీస్ జట్టు కనీసం వంద పరుగులైనా చేస్తుందా? అనే అనుమానం అభిమానుల్లో కలిగింది. ఈ దశలో ఇంగ్లాండ్ బౌలర్లను ప్రతిఘటిస్తూ కెప్టెన్ రోమన్ పావెల్(54), రుమారియో షెఫర్డ్ (34) వెస్టిండీస్ జట్టు ఇన్నింగ్స్ భారాన్ని మోశారు. ఫలితంగా ఆరో వికెట్ కు వీరిద్దరూ 83 పరుగులు జోడించారు. ఫలితంగా వెస్టిండీస్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. చివర్లో అల్జారి జోసెఫ్(21) అదరగొట్టడంతో వెస్టిండీస్ 145 రన్స్ స్కోర్ చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సఖి మహమ్మద్, ఓవర్టాన్ చెరో మూడు వికెట్లు సాధించారు. ఆర్చర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
తడబడుతూ.. చేదించింది
146 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు పోరాడింది. తడబడుతూ లక్ష్యాన్ని చేదించింది. ఇంగ్లాండ్ జట్టులో సామ్ కరణ్(41), లివింగ్ స్టోన్ (39), విల్ జాక్స్ (32) పరుగులు చేశారు.. లక్ష్యం స్వల్పమే అయినప్పటికీ వెస్టిండీస్ బౌలర్లు ఏమాత్రం బెదరలేదు. ముఖ్యంగా అఖిల్ హోయిసన్ బౌలింగ్లో పరుగులు తీయడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఇతడు 4 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ జట్టు ఒక దశలో ఓటమివైపు ప్రయాణించింది. అయితే చివరి ఓవర్లలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూకుడుగా ఆడటంతో లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో చేదించింది. కాగా, తొలి మ్యాచ్లో 7 వికెట్లు, రెండో మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. మిగతా నాలుగు, ఐదు మ్యాచులు నవంబర్ 16, 17 తేదీలలో గ్రాస్ ఐలెట్ వేదికగా జరగనున్నాయి. కాగా, ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో వెస్టిండీస్ విజయం సాధించింది. బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి సిరీస్ సొంతం చేసుకుంది. అయితే అదే ఊపును టీ20 సిరీస్లో కొనసాగించలేకపోయింది. వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయి స్వదేశంలో పరువు తీసుకుంది.