https://oktelugu.com/

Polavaram Project: పోలవరం పై కేంద్రం స్ట్రాంగ్ డెసిషన్.. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

ఏపీ సీఎం చంద్రబాబు తరచూ ఢిల్లీ వెళుతున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ముఖ్యంగా పోలవరం పై దృష్టి పెట్టారు. ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఉదారంగా సాయం చేయాలని కోరుతున్నారు. చంద్రబాబు విన్నపాన్ని కేంద్రం మన్నించినట్టు కనిపిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : August 24, 2024 / 12:16 PM IST

    Polavaram Project

    Follow us on

    Polavaram project : ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఉంది. వీలైనంత త్వరగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అందించాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు చెప్పారు. అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాయం చేయాలని కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆ విన్నపాన్ని కేంద్ర పెద్దలు మన్నించినట్టు కనిపిస్తున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నూతన డిపిఆర్ కు వచ్చేవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. పోలవరం నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం ముద్ర వేయాలని ఏపీ ప్రభుత్వం చాలా రోజులుగా కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ కు ఆమోదం ముద్ర వేస్తే మాత్రం.. పోలవరం ప్రాజెక్టుకు 12 వేల కోట్ల రూపాయలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని అడ్వాన్స్ గా తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 2014 నుంచి 2019 మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరిగింది. కానీ గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగలేదు. అందుకే కూటమి ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర సాయం అందేలా.. పెద్దలను ఒప్పించగలిగారు చంద్రబాబు.

    * నిధులు అవసరం
    పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా చేయాలంటే నిధులు అవసరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఉదారంగా ముందుకు రావాలి. అందుకే చంద్రబాబు తరచూ ఢిల్లీ వెళుతున్నారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, జల వనరుల శాఖ మంత్రి పాటిల్ తో పలుమార్లు సమావేశం అయ్యారు. పోలవరం నిర్మాణం పై చర్చించారు. పోలవరంలో 45.7.2 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేలా అవసరమైన అన్ని పనులు చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి ఆశిస్తున్నారు.

    * కొత్త డిపిఆర్ సిద్ధం
    పోలవరం తొలి దశకు సంబంధించి 30 వేల 436 కోట్ల రూపాయలకు కొత్త డి పి ఆర్ సిద్ధంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, సాంకేతిక సలహా మండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదాలు పొంది ఉంది. ఫైనల్ గా కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందాల్సి ఉంది. వచ్చేవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. అక్కడ డి పి ఆర్ కు ఆమోద ముద్ర వేస్తే నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. కేంద్ర మంత్రివర్గం తప్పనిసరిగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది.

    * తొలి దశ పేరుతో తాజాగా
    వాస్తవానికి 2010-11 ధరలతో 16 వేల కోట్లకు డిపిఆర్ ఆమోదం పొందింది. దాని ప్రకారం నిధులను కేంద్రం తిరిగి చెల్లించింది. తాజాగా తొలి దశ పేరుతో సిద్ధంగా ఉన్న డి పి ఆర్ ను కేంద్రం ఆమోదిస్తే రాష్ట్రానికి 12,157 కోట్ల రూపాయలు అందే అవకాశముంది.పోలవరానికి సంబంధించి మిగులు నిధులను ఇప్పటికే రియంబర్స్ చేసినందుకు.. ఈ మొత్తాన్ని అడ్వాన్స్గా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. 2016లో నాబార్డుతో కేంద్రం ఒప్పందం చేసుకొని వారి నుంచి రుణం పొంది రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోంది. దీంతో 12 వేల కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర మంత్రివర్గం డిపిఆర్ కు ఆమోదం తెలిపితే మాత్రం ఆ నిధులకు మోక్షం కలిగినట్టే.