Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy : వైసీపీలో కొత్త వాదన ప్రారంభమైంది. సరికొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. గత ఐదేళ్ల వైసిపి పాలనలో జరిగిన వైఫల్యాలను సరిదిద్దుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.ముఖ్యంగా పార్టీలో దళారుల ప్రమేయం తగ్గాలని నేతలు అభిప్రాయపడుతున్నారు. అధినేత ఎదుటే తేల్చి చెబుతున్నారు.ఎమ్మెల్యేలకు అధినేతకు మధ్య ఉన్న వారితోనే ఇంతటి అపజయం ఎదురైందని గుర్తు చేస్తున్నారు. అటువంటి వారిని పక్కన పెట్టాల్సిందేనని సూచిస్తున్నారు. దీంతో జగన్ డిఫెన్స్ లో పడుతున్నారు. వైసిపి హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం సుప్రీమ్. సీఎంవోలో ధనంజయ రెడ్డి పాత్ర అధికంగా ఉండేది. ప్రభుత్వ అధికారి కంటే.. వైసిపి ప్రతినిధి గానే ఆయన వ్యవహరించేవారు. పార్టీలో జరిగే పరిణామాలను ఆయనే పర్యవేక్షించేవారు. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. ఆ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. ఒక అధికారిగా ధనంజయ రెడ్డి ఇప్పుడు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఓటమి తర్వాత ఎక్కువ మంది ధనుంజయ రెడ్డి వల్లే పార్టీకి పరిస్థితి అని ఫిర్యాదులు కూడా చేశారు.అయితే ఆయన ప్రభుత్వ అధికారి కావడంతో.. ఆయన అప్రాధాన్య పోస్టులోకి వెళ్లిపోయారు. అయితే ఆ తరువాత ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నవి సజ్జల రామకృష్ణారెడ్డి పైనే. ఎట్టి పరిస్థితులలో ఆయనను సైడ్ చేయాలని పార్టీ సీనియర్లు సూచిస్తున్నారు. కొందరైతే డిమాండ్లు కూడా చేస్తున్నారు.
* సీనియర్లు బాహటంగానే
అనంతపురం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత అయితే సజ్జల అంటేనే మండిపడిపోతున్నారట. నిన్న మొన్న మంగళగిరి సమీక్షలో సైతం ఆ పార్టీ నేతలు డైరెక్టుగా సజ్జలనే ప్రస్తావిస్తున్నారట. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల నేతలు సైతం సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర తగ్గాలని జగన్ కు సూచిస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్న తాము సజ్జల సార్ అని పిలవాల్సి వచ్చేదని.. అటువంటిది ప్రజల వద్ద తమకు ఏం విలువ ఉంటుందని వారు ప్రశ్నించినట్లు సమాచారం.
* ఇప్పటికీ సజ్జలదే హవా
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో సజ్జల పాత్ర తగ్గుతుందా? జగన్ తగ్గించగలరా? ఆ సాహసం చేయగలరా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల వరకు వైసిపి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డిని జగన్ తప్పించారు. అయితే ఇదంతా ప్రచారం మాత్రమేనని.. భార్గవరెడ్డిని తండ్రి రామకృష్ణారెడ్డి తప్పించారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. జగన్ తర్వాతే ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి పైనే ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో తన కుమారుడికి ఇబ్బందులు తప్పవని రామకృష్ణారెడ్డి భావించారు. అందుకే వ్యూహాత్మకంగా జగన్ పై ఒత్తిడి తెచ్చి తప్పించేలా చేశారు. అయితే తనకు ఇబ్బంది ఉందని తెలిస్తే మాత్రం సజ్జల తనకు తానుగా పార్టీ బాధ్యతలు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సజ్జలను వదులుకునే స్థితిలో జగన్ లేరు. పార్టీ శ్రేణుల ఫిర్యాదులపై ఓపికగా వింటున్నారు జగన్. కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రం ఒక్క మాట అనడం లేదు. దీంతో సజ్జల విషయంలో జగన్ మనసులో ఏముందో తెలియడం లేదు.