Vettaiyan Collection: సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది జైలర్ మూవీతో ఆయన బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రం రూ. 600 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టింది. తాజాగా ఆయన వేట్టయన్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. దసరా కానుకగా విడుదలైన వేట్టయన్ చిత్రానికి మిశ్రమ స్పందన దక్కింది. వసూళ్లు కూడా అలానే ఉన్నాయి. వేట్టయన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పరిశీలిస్తే… ఇండియాలో అన్ని భాషలు కలిపి రూ. 30 కోట్లు రాబట్టింది. తమిళనాడులో ఈ చిత్రం రూ. 26.15 కోట్లు వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో వేట్టయన్ చిత్రానికి పెద్దగా స్పందన దక్కలేదు. ప్రమోషన్స్ సరిగా చేయక పోవడం కూడా మైనస్. తెలుగులో వేట్టయన్ ఏపీ/తెలంగాణలలో రూ. 3.2 కోట్లు రాబట్టింది. ఇక హిందీ వెర్షన్ కి కనీస ఆదరణ దక్కలేదు. కేవలం రూ. 60 లక్షలు వసూలు చేసింది. జైలర్ ఫస్ట్ డే రూ. 48.35 కోట్ల వసూళ్లు అందుకుంది. జైలర్ దరిదాపుల్లో కూడా వేట్టయన్ లేదు.
రజినీకాంత్ ప్లాప్ మూవీ అన్నాత్తేను మాత్రం వేట్టయన్ అధిగమించింది. అన్నాత్తే చిత్రం ఫస్ట్ డే రూ. 29.9 కోట్లు మాత్రమే రాబట్టింది. తెలుగులో వేట్టయన్ డిజాస్టర్ కావడం ఖాయం. పండగ రోజుల్లో కూడా పెద్దగా స్పందన దక్కడం లేదు. వేట్టయన్ మూవీలో భారీ తారాగణం నటించారు. అమితాబ్, రానా, ఫహద్ ఫాజిల్ వంటి టాలెంటెడ్ నటులు భాగమయ్యారు.
వేట్టయన్ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. టీజే జ్ఞానవేల్ దర్శకుడు. నెక్స్ట్ రజినీకాంత్ కూలీ చిత్రం చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కూలీ ప్రమోషనల్ పోస్టర్స్ ఆసక్తిరేపుతున్నాయి. కూలీ చిత్రంలో నాగార్జున కీలక రోల్ చేయడం మరో విశేషం. కూలీ షూటింగ్ సెట్స్ నుండి కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. వాటిలో నాగార్జున లుక్ కేక పుట్టిస్తుంది.
ఇటీవల రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. గుండె నుండి శరీరానికి రక్తం సరఫరా చేసే ప్రధాన నాళంలో వైద్యులు వాపు గుర్తించారు. స్టంట్ వేసి నయం చేశారు. రెండు రోజులు ఆసుపత్రిలో ఉన్న రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. రజినీకాంత్ తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు.